కలకలం రేపుతున్న వరుస హత్యలు వణుకు పుట్టిస్తున్న పాతబస్తీ!
చార్మినార్,జూన్ 19: పాతబస్తీ హత్యల బస్తీగా మారుతుంది. వరుస హత్యలు, హత్యా ప్రయత్న సంఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఓ సంఘటను మరవకముందే మరో సంఘటన చోటు చేసుకోవడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియురాలిపై యువకుడి దాడి చేసి ఇరవై నాలుగు గంటలు గడవకముందే శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన వరుస సంఘటనలు షాక్‌కు గురి చేస్తున్నాయి. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని హత్య చేయడం, ఆ హత్య జరిగిన పదిహేను నిమషాల వ్యవధిలోనే మరో ఇద్దరిని హత్య చేసుందుకు దాడి చేయడం పోలీసులను కలవర పాటుకు గురి చేసింది. సినిమాలను తలపించేలా ఏ భయం లేకుండా దుండగులు చేతిలో కత్తులు పట్టుకొని దాడులు చేస్తుంటే పోలీస్ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నదని బస్తీల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పాత కక్షలతో కత్తులతో దాడి
పాతకక్షలను మనస్సులో పెట్టుకొని అర్ధరాత్రి పూట చర్చించుకుందామని పిలిచి కత్తులతో నడిరోడ్డుపై దాడి చేసిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం శాలిబండ ఇన్‌స్పెక్టర్ ఎస్.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌కు చెందిన అసద్, అన్వర్ పాతనేరస్తులు. వీరిలో అసద్‌పై రౌడిషీట్ ఉంది. ఈ ఇద్దరితో కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన వాజీద్, సాజీద్, ఖాదీర్, రఫీఖ్ సిమ్లాన్‌లతో పాత కక్షలు ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మన మధ్య ఉన్న గొడవలపై చర్చించుకుందామని అసద్, అన్వర్‌లు వాజీద్‌ను తాడ్‌బన్ ప్రాంతంలోని ఫాతిమా వైద్యశాల సమీపానికి రప్పించారు.
విషయం తెలుసుకున్న వాజీద్ సోదరులు సాజిద్, ఖాదీర్, రఫీక్ సిమ్లాన్ కూడా ఫాతిమా వైద్యశాల వద్దకు వెళ్లారు. అప్పటికే అసద్, అన్వర్‌లు వాజీద్‌తో గొడవపడుతున్నారు. మాటామాట పెరగడంతో రెండు గ్రూపులుగా విడిపోయి దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అసద్, అన్వర్ తమ వెంట తెచ్చుకున్న కత్తులతో వాజీద్‌తో పాటు అతని సోదరులపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర కత్తిపోట్లకు గురైన రఫీక్ సిమ్లాన్(40) అక్కడికక్కడే మృతి చెందాడు. వాజీద్, సాజిద్, ఖాదీర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి నిందితులు పారిపోయారు. రఫీక్ సిమ్లాన్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మద్యం మత్తులో హత్యాయత్నం
శాలిబండ అలీబేగ్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్(28), రౌడిషీటరైన ఫయ్యాజ్ టక్క(35) స్నేహితులు. మంగళవారం అర్ధరాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగి, చందూలాల్‌బేలా బరందరి ప్రాంతంలో గొడవపడ్డారు. దీంతో ఫయ్యాజ్ టక్కర్ తన వద్ద ఉన్న కత్తితో ఫిరోజ్ మెడపై దాడి చేసి గాయపర్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫిరోజ్‌ను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.






