రిజర్వేషన్లు అడ్డుకుంటే ఇడుపు కాయితమే
ప్రొ.సంగని మల్లేశ్వర్ :
ఓబీసీలు అంటే ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకనే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఎప్పుడో చెప్పిన సుప్రీంకోర్టు తీర్పును సాకు చూపి చేతులు దులుపుకొంటున్నాయి. తొమ్మిదవ షెడ్యూల్ ద్వారా పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి 60 శాతం ఉన్న ఓబీసీలకు ఫలాలు అందేందుకు కృషిచేయకుండా చచ్చిపోయిన బర్రె.. పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చిందని కచ్చీరు కాడ చెప్పుకున్నట్టు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఓబీసీలపై మొసలి కన్నీరు కార్చడం మామూలైంది.
ఓబీసీ రిజర్వేషన్ల కోసం 1953లో ఏర్పాటు చేసిన కాకా కాలేల్కర్ కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. 1961లోపు కుల ఆధారిత జనాభా గణనను పూర్తిచేయాలని సూచించింది. అదే సంవత్సరం జరిగిన జనాభా లెక్కల ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించారు. అయితే కులాల లెక్కలు తేల్చలేదు. పైగా ఆయా రాష్ట్రాల్లో బీసీలు ఎవరో.. ఎందరు ఉన్నారో స్థానిక నాయకత్వం తెల్చుకోవాలని సూచించింది.
అదే స్ఫూర్తితో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకడుగు ముందుకేసి ఓబీసీల కులగణన చేసి, ఆయా కులాల జనాభా ప్రాతిపదికన వారికి ఫలాలు అందేందుకు కృషిచేస్తామని ప్రకటించారు. ఆ మాటల ను యావత్ ఓబీసీ సమాజం నమ్మింది.
కనుకనే 2024 ఎన్నికల్లో బీజేపీ ‘అబ్ కి బార్ చార్ సౌ పార్’ నినాదం మిషన్ ఇంపాజిబుల్‌గా మారిపోయి, కేవలం 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వస్తే 50శాతం రిజర్వేషన్లు దాటరాదనే నిబంధనను ఎత్తివేస్తామని తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లుపై ఎందుకు చర్చ చేయలేదనే విమర్శ ఉంది.
రాష్ట్రాల సమస్యగా పక్కదారి..
భారత రాజ్యాంగం ఓబీసీలు అంటే వెనుకబడిన కులాలుగా గుర్తించకుండా, వెనుకబడిన తరగతులుగా నిర్వచించి వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసింది. ఆర్టికల్ 15(4), 16(4) ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొన్నప్పటికీ, వెనుకబడిన తరగతులు అంటే ఎవరు? ఆయా వర్గాలను ఏ ప్రామాణికాల ఆధారంగా గుర్తించాలనే అంశంలో రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు దిక్సూచి అయ్యింది కానీ, ఓబీసీలను స్పష్టంగా నిర్వచించలేదు.
భారత రాజ్యాంగంలో చేర్చాల్సిన ఓబీసీ రిజర్వేషన్లు పార్లమెంట్ లాంటి రాజ్యాంగ పరిషత్‌లో ఓబీసీ ప్రతినిధులు తక్కువగా ఉం డడం, వారి అవగాహన, వాదనాపటిమ అగ్రవర్ణాల దాటిముందు చాలకపోవడం, ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యం వంటి అనేక కారణాల వల్ల రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వలె ఓబీసీ రిజర్వేషన్లు చేర్చలేదు. కాలేల్కర్ కమిషన్ నివేదిక ఇచ్చినప్పటికీ రిజర్వేషన్లు అమలు కాలేదు.
నాటి నుంచి ఇది ఆయా రాష్ట్రాల సమస్యగా పక్కదారి పట్టించారు. అయితే కమిషన్లు వేసుకొని రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో కృషిచేశాయి. కొన్ని రాష్ట్రాలు ఏకంగా జీవోల ద్వారా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాయి. అభ్యంతరాలు ఉన్న రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లు క్రమబద్దీకరించారు. ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ రాష్ట్రా ల్లో ఓబీసీల రిజర్వేషన్లు పెంచి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొని అమలుకు నోచుకోలేదు.
కమిషన్లు ఏర్పాటు చేసినా..
నాటి జనతా ప్రభుత్వ కాలంలో ములా యం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్ లాంటి ఉద్దండుల ఒత్తిడి మేరకు చరణ్ సింగ్ సర్కార్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం వెనుకబడిన వర్గాల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ మేరకు 1978 డిసెంబరు 20న అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయి పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు. బి.పి మండల్ చైర్మన్‌గా, మరో నలుగురు సభ్యులు, సెక్రటరీతో ఈ కమిషన్ ఏర్పాటైంది.
1980 డిసెంబర్ 31న రాష్ట్రపతికి మండల్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. అందులో ప్రధానంగా సామాజికపరమైన, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి 11 ప్రామణికాంశాలను లేదా సూచికలను మండల్ కమిషన్ ఎంచుకుంది. వాటిలో నాలుగు సామాజికపరమైన అంశాలు, మూడు విద్యాపరమైనవి, నాలుగు ఆర్థికపరమైన అంశాలు గా వర్గీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1970లో అనంత రామన్ కమిషన్ సూచించిన రిజర్వేషన్లు నేటికీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి.
తమిళనాడులో మాత్రం 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కొనసాగిస్తున్నారు. కాలేల్కర్ సూచన ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవడమనేది స్పష్టంగా ఆయా రాష్ట్రాలకు వదిలేశారు. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదానికి నోచుకోక జీవో జారీచేస్తే, కోర్టు స్టే విధించింది. చివరి ప్రయత్నంగా 9వ షెడ్యూ ల్లో చేర్చాలని ఒత్తిడి తెచ్చినా పార్లమెంట్‌లో చర్చ లేకుండానే బీజేపీ ప్రభుత్వం నీరుగార్చింది.
చిత్తశుద్ధితోనే ఉన్న రాష్ట్రాలు
ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో 1990లో మండల్ కమిషన్ నివేదిక అమల్లో భాగంగా ఆర్టికల్స్ 15(4), 16(4) ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు ప్రవేశపెడుతూ ఉత్తర్వులను జారీ చేసింది. అవి రాజ్యాంగ విరుద్ధమైనవని తెలుపుతూ రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇంద్రసహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఓబీసీ రిజర్వేషన్‌ను సమర్థించింది.
ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచడానికి సుప్రీంకోర్టు 50 శాతం నిబంధన చూపెడుతున్నారు. కానీ, 8 శాతం ఉన్న అగ్రవర్ణాల కోసం ఈ డబ్ల్యూఎస్ కోటాను 10 శాతానికి పెంచి ఓబీసీలకు అన్యాయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉన్నా సుప్రీంకోర్టు 50 శాతం నిబంధన పేరుతో ఓబీసీల ఆశలపై నీళ్లుపోస్తున్నది కేంద్రమే.
తెలంగాణ ప్రభుత్వం పంపిన 42శాతం రిజర్వేషన్లపై చర్చించకుండా, కేంద్రప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చుకుండా తాత్సారం చేయడం దేనికి సంకేతం? ఓబీసీలు రెండు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బీసీ సమాజం గమనిస్తున్నది.
ఓబీసీలు ఇడుపు కాగితం ఇవ్వకముందే రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయడానికి పార్లమెంట్‌లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఓబీసీ నేతగా ప్రచారం చేసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది.
వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి,
9866255355






