ఒక్క డిబేట్ గెలుపును నిర్ణయించలేదు
జోబైడెన్‌కు మద్దతుగా నిలిచిన బరాక్ ఒబామా
న్యూయార్క్, జూన్ 29 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన డిబేట్‌లో బైడెన్ పలుమార్లు తడబాటుకు గురైన తీరు డెమోక్రాటిక్ పార్టీలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బైడెన్ స్పందించారు. “అవును నేను యువకుడిని కాదు. ఈ విషయం నాకు తెలుసు. గతంలోలాగా చలాకీగా నడవలేను, స్పష్టంగా మాట్లాడలేను, చర్చించలేను.
కానీ నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. అధ్యక్ష పదవికి న్యాయం చేయగలనని మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టే మళ్లీ పోటీలో ఉన్నా” అని తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, జో బైడెన్‌కు సొంతపార్టీ నేత, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతుగా నిలిచారు. “డిబేట్లు సరిగా జరగని రోజులు ఉంటాయి. సాధారణ ప్రజల కోసం జీవితమంతా పోరాడిన వ్యక్తికి, తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తికి మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని పరోక్షంగా ట్రంప్‌పై విమర్శలు చేశారు. వీరిద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలనేది ఒక్క డిబేట్ నిర్ణయించలేదని బైడెన్‌కు మద్దతుగా వ్యాఖ్యానించారు.






