02-12-2025 07:10:23 PM
పిట్ట వెంకయ్య బాబు విజ్ఞప్తి..
గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంపై నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామంలోని అన్ని పార్టీ నాయకులకు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఎం.ఆర్.పి.ఎస్ మాజీ జిల్లా ఈసీ మెంబర్ పిట్ట వెంకయ్య బాబు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 1991లో గ్రామంలో తొలిసారిగా అంబేద్కర్ విగ్రహం తీసుకురావడంతో మూడు సంవత్సరాల పాటు వివాదం నెలకొంది. అనంతరం కోర్టు అనుమతితో 1994లో అధికారికంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. తరువాత నేషనల్ హైవే 167 రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విగ్రహాన్ని పాత స్థలం నుంచి తొలగించి కొత్త ప్రదేశంలో ఏర్పాటు చేశారు.
గ్రామ నాయకుల సూచనల మేరకు ఆ ప్రదేశంలోనే విగ్రహాన్ని నిలపడం జరిగింది. అయితే గ్రామంలో పేరుగల ఒక వ్యక్తి హైకోర్టు నుంచి సెట్స్ కో ఆర్డర్ తెచ్చుకోవడంతో విగ్రహాన్ని ఆచోట ఉండనివ్వకుండా తొలగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. సమస్యపై గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇంకా సమస్యకు పరిష్కారం లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతి మండలంలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణంపై కూడా సమావేశాలు జరిగినప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువడలేదన్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేశామని ఆయన తెలిపారు. మెయిన్ రోడ్డు నుంచి కల్మచెరువు రోడ్డుకు వెడల్పు పనులు పూర్తయ్యాయని, కల్మచెరువు రోడ్ ఎంట్రెన్స్ వద్ద దిమ్మె కూడా కట్టారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్న తరుణంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణంపై తక్షణ పరిష్కారం తీసుకురావాలని స్థానిక అన్ని పార్టీ నాయకులను పిట్ట వెంకయ్య బాబు కోరారు.