02-12-2025 07:13:51 PM
చందుపట్ల వద్ద స్కూటీ అదుపుతప్పి యువకుడు దుర్మరణం
చివ్వెంల (విజయక్రాంతి): చివ్వెంల మండలం చందుపట్ల గ్రామ శివారులో జరిగిన దుర్ఘటన స్థానికులను కలచివేసింది. స్కూటీ అదుపుతప్పి పడిపోవడంతో 28 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే... ఆత్మకూరు ఎస్ మండలం దాచారం గ్రామానికి చెందిన పల్లెటి నవీన్, తండ్రి శ్రీనయ్య సూర్యాపేట నుండి మోతే వైపు తన స్కూటీపై ప్రయాణిస్తున్నాడు. వేగం ఎక్కువగా ఉండటం వలన చందుపట్ల గ్రామం వద్ద వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు.
తలకు తీవ్రమైన గాయాలు కావడంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి అకాల మరణంతో దాచారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మితమైన వేగంతో ప్రయాణించాలని, రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.