అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక పథకం ప్రకటించాలి..
తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనకై అమరులైన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రత్యేక పథకం ప్రకటించాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ చరిత్రలో డిసెంబర్ 9కి ఎంతో విశిష్టత ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎందరో యువకులు అమరులవుతున్న పరిస్థితుల్లో 2009 డిసెంబర్ 9న సోనియాగాంధీ ఒక తల్లిగా స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుందని తెలిసినప్పటికిని ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వై కొండల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కొండల్ రెడ్డి కార్యదర్శి జి. కృష్ణ, న్యాయవాదులు రాధాకృష్ణ, కీర్తి కుమారి, మీనాక్షి, పి. సురేష్, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.




