బయోఫార్మా రంగంలో ముందడుగు
- ‘తెరానిమ్ బయోలాజిక్స్’తో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నూతన ఊతం
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- సంగారెడ్డి జిల్లా బోరపట్ల శివారులో తెరానిమ్ బయోలాజిక్స్ యూనిట్ ప్రారంభం
- హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, జూన్ 3 (విజయక్రాంతి): తెరానిమ్ బయోలాజిక్స్ యూనిట్ ప్రారంభం ద్వారా తెలంగాణ బయోఫా ర్మా రంగంలో మరో కీలక ముందడుగు పడిందని, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఇది నూతన ఊతాన్ని అందిస్తుందని మం త్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరపట్ల శివారులో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన తెరానిమ్ బయోలాజిక్స్ తయారీ యూనిట్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారదర్శక విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. బయోటెక్నాలజీ, ఔషధ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలో అగ్రగామిగా నిలిచిందని, ఔషధ రంగంలో ఆధునిక సాంకేతికతతో కూడిన తెరానిమ్ బయోలాజిక్స్ వంటి సంస్థల రాకతో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు.
ఈ సంస్థ ద్వారా స్థానిక యువత కు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని అన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ అత్యాధునిక బయోలాజికల్ ఔషధాల తయారీలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సంస్థ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ కలెక్టర్ పాండు పాల్గొన్నారు.






