06-10-2025 12:00:00 AM
వ్యర్థాలు, మట్టి, డ్రైనేజీ చేరడంతో భరించలేని దుర్వాసన
ఎల్బీనగర్, అక్టోబర్ 5 : హయత్ నగర్ డివిజన్ లోని కుమ్మరి కుంట వ్యర్థాలు చేరడంతో భరించలేని దుర్వాసన వెదజల్లుతూ కంపు కొడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి, వ్యర్థాలు, డ్రైనేజీ నీరు చేరడంతో భరించలేని దుర్వాసనతో కుమ్మరి కుంట పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దోమలు వృద్ధి చెందడంతో ప్రజలు రాత్రివేళ కంటినిండా నిద్ర పోలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల కుంట మొత్తం గుర్రపు డెక్క ఆక్రమించింది. ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు కొద్దిరోజుల క్రితం కుమ్మరి కుంటలో గుర్రపు డెక్కను తొలిగించారు. అయితే, తొలిగించిన గుర్రపు డెక్క, వ్యర్థాలను పూర్తిస్థాయిలో చెల్లించకుండా అక్కడే వదిలిపెట్టారు. దీనికి తోడు ఇటీవల వర్షాలు కురవడంతో భారీస్థాయిలో వ్యర్థాలు, మట్టి, డ్రైనేజీ చేరడంతో కుమ్మరి కుంట కంపు కొడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుమ్మరి కుంటలో వ్యర్థాలను తొలిగించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.