06-10-2025 12:00:00 AM
ఖమ్మం, అక్టోబరు 05 (విజయక్రాంతి): తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. పాలేరు, ఖమ్మం, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో కొర్ర రమేష్ నివాసంలో నూతన గృహప్రవేశ వేడుకకు హాజరై దంపతులకు అభినందనలు తెలిపారు.
అనంతరం ఖమ్మం నగరంలోని గుర్రం జగన్మోహన్రావు ఫంక్షన్హాల్లో 60వ డివిజన్ కార్పొరేటర్ బద్దె నిరంజన్ కుమారుని పంచెకట్టు వేడుక, అలాగే ఎస్.ఆర్. కన్వెన్షన్లో కాంగ్రెస్ నాయకుడు భీమనాధుల అశోక్రెడ్డి కుమార్తె ఓణీల అలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.మధిర మండలం ఆత్కూరు గ్రామంలో కంభంపాటి సురేష్ రిసెప్షన్కు హాజరైన మంత్రి నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు.
ఇల్లూరులో ఇటీవల వివాహం చేసుకున్న కోట రామారావు కుమారుడు, కోడలిని ఆశీర్వదించారు. మర్లపాడు గ్రామంలో అనారోగ్యంతో మరణించిన యువకుడు లక్ష్మా రెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి సానుభూతిని తెలిపారు.
వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు అట్లూరి సత్యనారాయణరెడ్డి నిర్వహించిన చండీహోమంలో పాల్గొని పూజలు చేశారు. కుంచపర్తి గ్రామంలో కుక్కపల్లి రామకృష్ణ కుమారుడు, కోడలిని ఆశీర్వదించిన మంత్రి, శంభునిగూడెం గ్రామంలో అర్వపల్లి నరసింహారావు కుమారుని రిసెప్షన్లో పాల్గొన్నారు.