06-10-2025 12:00:00 AM
బూర్గంపాడు,అక్టోబరు 5,(విజయక్రాంతి):యువకులు చేయి..చేయి కలిపారు. గ్రామంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి ఆదర్శంగా నిలిచారు. బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన పలువురు యువకులు హైదారాబాద్, బెంగుళూరు, చెన్నై పట్టణాలలో ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలకు అండగా నిలిస్తున్నారు.
దసరా పండుగ కావడంతో ఇళ్లకు వచ్చారు. గ్రామానికి చేరుకున్న స్నేహితులతో కలిసి నవరాత్రులు ఆనందంగా గడిపారు. ఇదిలా ఉండగా గ్రామంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. తరచుగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండడంతో చలించిపోయారు. ఆదివారం యువకులు సొంత ఖర్చులతో మోరంపల్లి బంజర ప్రధాన సెంటర్ నుంచి మండల కేంద్రమైన బూర్గంపాడు వైపునకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను మిక్సింగ్ తో నింపారు. అధికారులు, రాజకీయ నాయకుల తీరుకు నిదర్శనంగా యువకులు చేపట్టిన కార్యక్రమానికి పలువురు ప్రశంసలు కురిపించారు.
గుంతలను పూడ్చి ఆదర్శంగా నిలిచిన యువకులను గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మూల నరేందర్ రెడ్డి , కామిరెడ్డి కార్తీకరెడ్డి, బొబ్బాల శ్రీనివాసరెడ్డి, గుంటకల్లు వివేక్, అరిపినేని సాయి నరేంద్ర,మేడం వెంకట్రామిరెడ్డి, గుజ్జు రాజమహేందర్రెడ్డి, కామిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.