20-01-2026 12:47:33 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పాఠశాల గేటు ముందు ఉన్న ఓ విద్యుత్తు స్తంభాన్ని ప్రమాదవశాత్తు తాకడంతో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రకల్ గ్రామానికి చెందిన మల్లేష్, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
9వ తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు లోకేష్ (14) రోజులాగే పాఠశాలకు చేరుకుని పాఠశాలలో ఆటల పోటీలు ఉన్నాయని బయట ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం వద్ద ఉన్న విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే కుప్పకులాడు. అది గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులను పిలిపించి విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు గ్రామస్తులు ఆరోపించారు.