10 April, 2026 | 2:42 AM

మిర్చి క్వింటాకు రూ.25వేల మద్దతు ధర ప్రకటించాలి

10-04-2026 12:49 AM

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్

వరంగల్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి):మార్కెట్లో రైతులు సరుకులను అమ్మే సందర్భంలో నిర్ణయించే జెండా పాటను సరుకులన్నింటికీ అమలు చేసి దోపిడిని నివారించాలని, మిర్చికి క్వింటాకు 25వేల రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. గురువారం అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రతినిధి బృందం వరంగల్ ఏనుమాముల మార్కెట్ ను సందర్శించి పంటల క్రయవిక్రయాలను, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, డి ఎం ఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి మల్లేశంలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటలు పండిస్తే మార్కెట్లో సరైన ధర రాక తీవ్రంగా నష్టపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మార్కెట్లో మిర్చి పంటకు జెండా పాట పేరుతో కేవలం కొద్ది మంది రైతుల సరుకులకే అమలు చేసి మెజారిటీ రైతాంగానికి జెండా పాట కంటే  తక్కువ ధరతో కొనుగోలు చేస్తూ రైతులకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మిర్చి కొనుగోళ్లకు ఎలాంటి ప్రమాణాలు లేకపోవడంతో వ్యాపారులు, ఖరీదుదారులు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తున్నారని అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి మంచి డిమాండ్ ఉన్నదని అదే సందర్భంలో గతంతో పోల్చితే పంట విస్తరణ దిగుబడి తగ్గిందని ఇలాంటి పరిస్థితుల్లో కుంటి సాకులతో రైతులు పండించిన మిర్చికి ధరను తగిన స్థాయిలో నిర్ణయించకపోవడం అన్యాయం అన్నారు.

మిర్చికి కనీస మద్దతు ధర కింటాకు 25 వేల రూపాయలు ప్రకటించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంస రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబా బాబురావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, ఏఐసిటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర రామస్వామి, సుంచు జగదీశ్వర్, రైతు సంఘం నాయకులు మంద రవి, కర్ర రాజిరెడ్డి, ఐతం నాగేష్, మొగిలి శ్రీనివాస రావు, పరిమళ గోవర్ధన్ రాజు, సోమిడి రవి, పేర బోయిన ఐలోని, నరసయ్య, ప్రభాకర్ లతోపాటు రైతులు పాల్గొన్నారు.