07-12-2025 01:19:18 AM
ఇది సర్కార్ చేసిన హత్యే!
భగ్గుమన్న బీసీలు.. రాస్తారోకో
జగద్గిరిగుట్టలోని గుబురుగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి
‘సాయి ఈశ్వర్ అమర్ రహే..
బీసీ ద్రోహి కాంగ్రెస్ డౌన్ డౌన్’
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బీసీలైన తమకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మోసంచేస్తారా అంటూ నినదించిన ఓ బీసీ బిడ్డ గొంతుక మూగబోయింది. ప్రభుత్వం చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక, ఆవేదనతో రగిలిపోయి తన శరీరానికి నిప్పంటించుకున్న.. సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకు డు సాయి ఈశ్వరాచారి అంతిమయాత్ర శనివారం కన్నీటి సంద్రంగా మారింది.
జగద్గిరి గుట్టలోని గుబురుగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన ని వాసం నుంచి గుబురుగుట్ట శ్మశానవాటిక వరకు సాగిన అంతిమయాత్రలో బీసీ సం ఘాల నేతలు, కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు వేలాదిగా పాల్గొన్నారు. ‘సాయి ఈశ్వ ర్ అమర్ రహే.. బీసీ ద్రోహి కాంగ్రెస్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 500 గజాల ఇళ్ల స్థలం లేదా డబుల్ బెడ్రూం
ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బీసీ సంఘాలు పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించాయి. జగద్గిరిగుట్టలో ని సాయి ఈశ్వరాచారి నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు ఆయన పార్థి వదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్‌ఎస్ నేతలు పల్లె రవికుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, వకుళాభరణం కృష్ణమోహన్, గణేష్ చారి, టీఆర్పీ నేత పల్లబోయిన అశోక్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
గొంతు కోశారు: ఆర్ కృష్ణయ్య
అంతిమయాత్రలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభు త్వంపై నిప్పులు చెరిగారు. సాయి ఈశ్వరాచారిది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని విమర్శించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ నమ్మబలికింది. తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని 17-20 శాతానికి కుదించి మోసం చేసింది.
రిజర్వేషన్లు తగ్గుతున్నాయని బీసీ కమిషన్ చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ మోసాన్ని తట్టుకోలేక, తీవ్ర మనస్తాపంతోనే సాయి ఈశ్వర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు’ అని ఆరోపించారు. ఒక బీసీ బిడ్డ చనిపోతే సీఎం, కిషన్ రెడ్డిలకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, ఇల్లు ఇవ్వాల్సిందేనని కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా లెక్కల తర్వాత కేంద్రం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
48 గంటల్లో స్పందించాల్సిందే: జాజుల
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఒక బీసీ బిడ్డ ఆత్మబలిదానం చేసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కనీసం సానుభూతి తెలిపే సమయం కూడా లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోనే ఉండి కూడా కిషన్‌రెడ్డి కనీసం ఫోన్ లో పరామర్శించకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 48 గంటల్లోగా సాయి ఈశ్వర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోక పోతే.. డిసెంబర్ రెండో వారంలో వేలాది మందితో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆదుకునే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, బీసీ మంత్రులు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీబీసీఐడీ విచారణ జరపాలి..
సాయి ఈశ్వరచారి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం సీబీసీఐడీ చేత దర్యాప్తు జరిపించి, మరణం వెనుక ఎవరిదైనా హస్తం ఉంటే, వారిని కఠినంగా శిక్షించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాల్లో ఇదే మొదటిది.. ఇదే చివరి బలిదానం కావాలన్నారు.
జగద్గిరిగుట్టలో జరిగిన సాయి ఈశ్వరచారి అంత్యక్రియల సందర్భంగా ఆయన నివాళులర్పించి మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో కాం గ్రెస్, బీజేపీలు ఆడుతున్న డ్రామాలకు సాయి ఈశ్వర్ బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్యతో పాటు.. కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేసియా అందించాలని డిమాండ్ చేశారు.