07-12-2025 01:19:05 AM
పదవులు ఎక్కువ.. ఓటర్లు తక్కువ!
-ఎన్నికల బరిలో రెండు కుటుంబాల సభ్యులు
-జోడు పదవులకు ఒక్కరే పోటీ
-మహమూద్ పట్నం ‘పంచాయతీ’ ఎన్నిక విభిన్నం
మహబూబాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): అదృష్టం అంటే వారిదే.. గ్రామం లో సర్పంచ్‌తో పాటు మూడు వార్డు సభ్యు ల పదవులను ఎస్టీలకు రిజర్వు చేశారు. అయితే గ్రామంలో మొత్తంగా ఎస్టీ ఓట్లు ఏడు మాత్రమే ఉన్నాయి. దీనితో సర్పంచ్ పదవితో పాటు వార్డు మెంబర్ జోడు పదవులకు ఒక్కరే పోటీపడుతూ, మిగిలిన వార్డు సభ్యుల స్థానాల్లో తమ కుటుంబ సభ్యులను పోటీ చేయించాల్సిన విభిన్న పరిస్థితి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది.
సర్పంచ్‌తో పాటు 1, 2, 3వ వార్డు మెంబర్ల పదవులు ఎస్టీలకు కేటాయించారు. అయితే, గ్రామంలో మొత్తంగా ఏడుగురు మాత్రమే ఎస్టీ ఓటర్లు ఉన్నారు. దీనితో రెండు కుటుంబాలకు చెందిన వారిని అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎన్నికల బరిలో నిలిపాయి. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ పదవికి, రెండవ వార్డు సభ్యురాలిగా దాసరి లచ్చమ్మ జోడు పదవులకు పోటీ చేస్తున్నారు. అలాగే ఆమె భర్త పెంటయ్య మూడవ వార్డుకు, కొడుకు సమ్మయ్య ఒకటవ వార్డు సభ్యుడిగా బరిలో నిలిచారు.
ఇక ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కట్ల ఎల్ల య్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ లో నిలిచారు. రెండవ వార్డ్ సభ్యురాలిగా ఎల్లయ్య భార్య లచ్చమ్మ పోటీ చేస్తుండగా, మూడవ వార్డు సభ్యురాలిగా ఎల్లయ్య తల్లి బుచ్చమ్మ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇలా ఆ గ్రామంలో మూడు వార్డు సభ్యులు, సర్పంచ్ పదవికి రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు పోటీలో నిలవడం మహబూబాబాద్ జిల్లా లో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో విశేషంగా మారింది.