ఓటుకు వెయ్యి
చార్జీలు, బత్తా కింద పంచిన పార్టీలు
కొన్నిచోట్ల ఓటుకు రూ.500తో సరి
ఓటర్లను పల్లెలకు రప్పించేందుకు తిప్పలు
ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు డబుల్ ధమాకా..
ఒక్కో ఓటర్‌కు రూ.5 వేల వరకు తాయిలం
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): ‘పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి’.. ఇది ప్రతి ఎన్నికలకు ముందురోజు ఎన్నికల కమిషన్ సాధారణంగా చెప్పే డైలాగు. కానీ ఈ డైలాగు ఇప్పుడు అభ్యర్థులు, పార్టీలు కూడా చెప్తున్నాయి. ప్రచారానికి తెరపడిన మరుక్షణం నుంచి పార్టీలు ‘ఏర్పాట్లు పూర్తిచేసే’ పనిలో పడ్డాయి. స్థానికంగా ఉండే ఓటర్లలు దారిమళ్లకుండా చూస్తూనే.. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించి ఓటు వేయించుకొనేందుకు ‘ప్రత్యేక ఏర్పాట్లు’ చేశాయి.
ఓటుకు రూ.500 నుంచి రూ.1౦౦౦
రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో ఎంత డబ్బు వెదజల్లేందుకైనా వెనుకాడటం లేదు. తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ఓటుకు ఇంత అని లెక్కగట్టి పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. ప్రాంతాన్ని, ఓటీని బట్టి ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.౧౦౦౦ వరకు పంపిణీ చేసినట్టు సమాచారం. కొన్ని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఈ పంపకాలు చాలా తక్కువగా జరిగినట్టు తెలిసింది.
ఆదిలాబాద్, మహబూబాబాద్‌లాంటి చోట పంపకాలు స్వల్పంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని రణదివె నగర్‌లో కాంగ్రెస్ రూ.500 లతో పాటు పార్టీ గుర్తును కవర్‌లో పెట్టి ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అది తాము చేయలేమని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని కాంగ్రెస్ ఖండించింది. మహబూబాబాద్‌లో ఒక జాతీయ పార్టీ ఓటుకు రూ.200 నుంచి రూ.250 వరకు పంచితే.. మరో రెండు పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.100 పంచినట్టు ప్రజలు చెప్పారు.
ఏపీ ఓటర్లుకు డబుల్ ధమాకా
ఆంధ్రప్రవేశ్‌లో లోక్‌సభతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండటం, ఆ రాష్ట్ర ఓటర్లు లక్షలమంది హైదరాబాద్‌లో ఉండటంతో.. వారికి సొంతప్రాంతాలకు రప్పించేందుకు ఏపీ పార్టీలు భారీగా డబ్బు ఖర్చు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి సొంతూరికి వచ్చి ఓటువేసేందుకు ఒక్కొక్కరికి రూ.4 వేల నుంచి రూ.5 వేలవరకు ముట్టచెప్పినట్టు సమాచారం. ఇందులో రవాణా చార్జీలు, భత్యం, ఓటర్‌కు అందించే నగదు కూడా ఉన్నాయి. ఒక కుటుంబంలో మూడు ఓట్లు ఉంటే గంపగుత్తగా రూ.10 వేలు అందించినట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన ఓటర్లు దాదాపు 20 లక్షల మందికంటే ఎక్కువగానే ఉంటారని అంచనా.
జనరల్ స్థానాల్లోనే భారీ పంపకాలు
జనరల్ స్థానాలు.. అందులోనూ పోటీ అధికంగా ఉన్న స్థానాల్లో ఓటర్లకు భారీగా డబ్బు పంచినట్టు సమా చారం. మల్కాజిగిరి, ఖమ్మం, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, మహ బూబ్‌నగర్, నల్లగొండ లాంటి చోట్ల ఓటుకు రూ.500 నుంచి రూ.౧౦౦౦ వరకు పంపిణీ చేశారు. అయితే ఇందులో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని నిర్దేశిత ఓటర్లకే పంపిణీ చేశారు. వరంగల్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి లాంటి రిజర్వుడు స్థానాల్లో కూడా పోటీ తీవ్రంగా ఉండటంతో ఓటుకు రూ.౧౦౦౦ చొప్పున పంచినట్టు తెలిసింది. అయితే ఓటర్లు అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకొంటుండటంతో అభ్యర్థులు తెలివిగా తటస్థ ఓటర్లనే ఎంపిక చేసుకొని డబ్బు పంపిణీ చేసినట్టు సమాచారం.




