12 April, 2026 | 10:41 PM

తటస్థ ఓటర్లకే తాయిలాలు!

13-05-2024 12:56 AM

మధ్యతరగతి, బస్తీల ఓటర్లపై అభ్యర్థుల ఆశలు

అర్ధరాత్రి నగదు, నజరానాలు పంపిణీ చేస్తోన్న అనుచరులు!

ఓటర్లను తరలించేందుకు అద్దెకు ఆటోలు

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెర పడటం తో అభ్యర్థులు తాయిలాలతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగదు, ఖరీదైన బహుమతులు పంపిణీ చేస్తున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చాలని నేతలు కోరుతున్నారు. ముఖ్యంగా తటస్థ ఓటర్లతో పాటు బస్తీల్లో నివసించేవారిపైనే అభ్యర్థులు దృష్టిసారించారు. ఈ మేరకు డివిజన్ల బాధ్యులు గత రాత్రి నుంచి పేద, మధ్యతరగతి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.

కాలనీ, అపార్టుమెంటు వాసుల్లో నివసించే గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కనీసం వారికి ఓటర్ స్లిప్పులు కూడా ఇవ్వడంలేదని, ఎన్నికల ప్రచారం ప్రారంభంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందజేసిన బూత్ ఇన్‌చార్జులు పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఇటువైపు రావడంలేదని పలువురు కాలనీవాసులు అంటున్నారు. రాష్ట్రంలో 17 పార్ల మెంటు స్థానాల్లో పోటీ చేసిన మూడు ప్రధా న పార్టీల అభ్యర్థులంతా కోటీశ్వరులే. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి రూ.20 కోట్ల ఖర్చు పెట్టినట్లు, అదేవిధంగా పార్టీ బలహీనంగా ప్రాంతాల్లో ఓటర్లను మచ్చిక చేసేందుకు నగదు పంపిణీకి ఏర్పాట్లు చేశారు.

నియోజకవర్గంలోని ఓటర్లలో 30 శాతం మందికి ఏదో ఒక రూపంలో తాయిలాలు అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాత్రి 10 గంటల తరువాత ఓటుకు రూ.500 చొప్పన పంపకాలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నాలుగైదు రోజులకే వారికి రూ.5లక్షల వరకు ప్యాకేజీ ఇచ్చినట్లు, మళ్లీ ఓటర్లకు అందించే నగదును కూడా జేబుల్లో వేసుకుంటున్నారని చెబుతున్నారు. స్థానిక నేతల దొంగచాటు వ్యవహారాలపైనా అభ్యర్థులు కన్నేసి ఉంచారు.  

ప్రత్యేక ఆటోల్లో ఓటర్ల తరలింపు 

పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్న బస్తీ ప్రజలను ప్రత్యేక వాహనాల్లో  ఓట్లు వేయించేందుకు కొందరు అభ్యర్థులు ఆటోలను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటోలో వచ్చే వారంతా వారికే ఓటు వేసేలా మాట్లా డి మధ్యాహ్నం భోజనంగా బిర్యానీ ప్యాకెట్లు అందించనున్నారు. వీళ్లు గంపగుత్తగా ఒకే అభ్యర్థిగా ఓటు వేసేలా కొందరు నాయకులు ప్లాన్ చేసినట్లు వారి అనుచురులు పేర్కొంటున్నారు.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టిన తరువాత ప్రజల్లో కొంత మార్పు వచ్చిందని, పింఛన్లు, రైతుబంధు, కరెంటు కోతలపై నిలదీస్తున్నారని కొందరు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అంటున్నారు. దీంతో వ్యతిరేకత పెరిగిందని, నిలదీ సే వారిని మచ్చిక తీసుకుని నగదు పంపిణీతో పాటు ఇతర పార్టీలకు ఓటు వేయకుం డా ఆటోల్లో తీసుకెళ్లి వారికే వేసే విధంగా జాగ్రత్తలు పడుతున్నారు. మరోవైపు ఇతర పార్టీలకు అమ్ముడుపోయే నాయకులు ఎక్కువ బీఆర్‌ఎస్‌లో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. 

అధికారం కోల్పోయిన తరువాత కాంగ్రెస్ నాయకుల చెంత చేరుతున్నా రు. మొన్నటివరకు ఆర్థికంగా ఆదుకున్న నేతలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నా రని గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరికొందరు గల్లీ లీడర్లు బీఆర్‌ఎస్ లోనే ఉంటూ సొంత పార్టీ నేతలకు సరైన సహకారం అందించటం లేదని సీనియర్ నేతలు అంటున్నారు.