16 July, 2026 | 12:27 AM

రైతుల కన్నీటి ఏరువాక

16-07-2026 12:00 AM

రాష్ర్టంలో వానాకాలం సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా వానలే కురవడం లేదు. తొలకరి జల్లులకు మురిసిపోయి ఖరీఫ్ సీజన్‌లోకి అడుగుపెట్టిన రైతన్న ఇప్పుడు లోటు వర్షపాతంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే రాష్ర్టంలోని అన్ని జలాశయాలు వెలవెలబోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఈ పరిస్థితులలో భూమిని నమ్ముకొని వ్యవసాయం చేయడం తప్ప, ఏమీ తెలియని రైతు కుటుంబాల్లో అనిశ్చితి నెలకొంది. దేశంలో 70 శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. వారంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో వారి ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

చివరికి దేశంలో ఆహార సంక్షోభంతో పాటు కోట్ల మంది ప్రజలు తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. సాధారణంగా జూలైలో వరి నాట్లు జోరందుకుంటాయి. జూన్ మూడో వారం నుంచే పత్తి, మొక్కజొన్న విత్తనాలు నాటుతారు. కానీ, ఈ ఏడాది లోటు వర్షపాతం కారణంగా సాగువిస్తీర్ణం గణనీయంగా పడిపోయినట్టు ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, నీటినిర్వహణ, వ్యవసాయ విధానాలపై రైతులు, ప్రభుత్వాలు పునరాలోచించాల్సిన అవసరం ఉంది.

నీటిలభ్యత తగ్గుతున్న సమయంలో ఒకే పంటను ప్రోత్సహించడం సరికాదు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు వంటి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రైతు వర్షంపై మాత్రమే ఆధారపడే పరిస్థితి నుంచి ఇకనైనా బయటపడాలి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను మార్చుకోవాలి. మైక్రోఇరిగేషన్, డ్రిప్స్ స్ప్రింక్లర్ల వాడకం వంటి నీటిని ఆదా చేసే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. శాస్త్రీయ సలహాలు, పంటల వైవిధ్యం, పంటబీమా, విత్తనాల ప్రత్యామ్నాయాలు, నీటివినియోగ ప్రణాళిక, పంటలకు మద్దతు ధర.. ఇవే రైతుకు ప్రభుత్వాలు ఇచ్చే అసలైన భరోసా. లేకపోతే ప్రతి పంట కాలం ఒక అనిశ్చితి కథగానే మిగిలిపోతుంది. 

 బైరబోయిన వెంకటేశ్వర్లు

పురుగుమందుల పంట!

దేశానికి రైతే వెన్నెముక అంటూ పాలకులు పదే పదే చెబుతుంటారు. కానీ, ఆచరణలో రైతును కనీసం కాపాడుకునే పరిస్థితులు లేవు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల అన్నదాత ఆగమాగమవుతుంటే.. మరోవైపు విదేశాలకు భారతీయ పంటల ఎగుమతి ఇక ‘కల’గానే మారే దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విత్తన నాణ్యతలో రాజీ మాత్రమే కాదు, వ్యవసాయ విధానంలోనూ, రైతులకు అందించే ఎరువులు, పురుగు మందులపై నియంత్రణ, శాస్త్రీయ పద్ధతుల్లో మార్గదర్శనం చేయడంలోనూ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.

దీంతో రైతు పాత పద్ధతిలోనే పంటల సాగుచేస్తూ తీవ్రంగా నష్టపోతున్నాడు. ప్రపంచ దేశాలలో నిషేధం విధించిన పురుగుల మందులను పంటచేనులో పిచికారీ చేస్తూ.. ఒక్క మాటలో చెప్పాలంటే రైతన్న ‘విషం పండిస్తున్నాడు’. డీఎన్‌ఏకు నష్టం కలగజేసే డైమోథోయేట్ మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల పురుగుల మందులను యథేచ్ఛగా పంటలలో వాడుతున్నాడు. వీటి నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదు. ఫలితంగా రైతు పండించే పంట విషతుల్యం అవుతున్నది.

ఇటీవల గుంటూరు మిర్చిని చైనా అధికారులు తిరస్కరించారు. ఆ మిర్చిలో పరిమితికి మించి మిథామిడోపాస్ అనే పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు పరీక్షలలో తేలడమే అందుకు కారణం. ఇదొక్కటే కాదు, భవిష్యత్తులో భారతదేశం నుంచి ఏ పంటను విదేశాలకు ఎగుమతి చేసినా వారు అక్కడ పరీక్షలు చేసి పురుగులమందుల అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకున్న తర్వాతే దిగుమతి చేసుకుంటారు. ఈ నేపథ్యంలో పురుగుల మందుల వాడకంపై పరిమితులు, అవసరమైతే నిషేధమూ విధించి సేంద్రియ పద్ధతిలో పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే రైతు మనగలుగుతాడు.

 అంబీర్ శ్రీకాంత్, 8185968059