పాత దోపిడీకి కొత్త రూపమే పీపీపీ!
తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, బ్లడ్ టెస్టుల నిర్వహణను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలన్న రేవంత్ సర్కార్ యోచన, వందల కోట్ల మెయింటెనెన్స్ భారాన్ని తగ్గించుకునే సాంకేతిక చర్యగా కనిపిస్తోంది. కానీ చరిత్రను తిరగేస్తే, ఇది కొత్త ఆలోచన కాదు; సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని ప్రైవేట్ చేతుల్లోకి పంపే పాత పాలనా పంథాకు ఇది కొనసాగింపు మాత్రమే.
తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో యంత్ర పరికరాల కొనుగోళ్లు, వాటి వార్షిక నిర్వహణ కాంట్రాక్టుల ద్వారానే సాగుతున్నాయి. మరమ్మతులు ఆలస్యమైతే వారాల తరబడి యంత్రాలు మూలనపడతాయి. రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లక తప్పని దుస్థితి. ఈ నిర్వహణ లోపాన్ని పరిష్కరించే పేరుతో, యంత్రాల యాజమాన్యాన్నే నేరుగా కంపెనీలకు అప్పగించాలని చూస్తున్నారు. అంటే, ప్రభుత్వం తన సొంత సామర్థ్యాన్ని పెంచుకోవడం అనే దీర్ఘకాలిక పరిష్కారానికి బదులు, ప్రతిసారీ ప్రైవేట్ భాగస్వామ్యాన్నే తక్షణ ఉపశమనంగా ఎంచుకుంటోంది.
చంద్రబాబు హయాంలో యూజర్ చార్జీలు, వైఎస్సార్ కాలంలో ఆరోగ్యశ్రీ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రజాధన బదిలీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ప్రైవేట్ విద్యా సామ్రాజ్యాల నిర్మాణం వంటి విధానాలను మనం చూశాం. వీటన్నింటి వెనుక ఉన్న ఉమ్మడి సూత్రం ఒక్కటే, ప్రభుత్వరంగాన్ని స్వయంగా బలోపేతం చేయకుండా, పేదల సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని ప్రైవేట్ మార్గాల్లో మళ్లించడం. ఈ పీపీపీ యంత్రాల నమూ నా అదే వరుసలో తాజా అధ్యాయం. అయితే స్థాయిలో తేడా ఉంది, అది ఒప్పుకోవాల్సిందే. ఆరోగ్యశ్రీలో చికిత్స మొత్తం కార్పొరేట్ ఆసుపత్రికే బదిలీ అయ్యింది, ప్రభుత్వాసుపత్రి పాత్ర శూన్యమైంది. ఇక్కడ యంత్రం ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ ప్రభుత్వ వైద్యుడిదే. కాబట్టి ఇది సంపూర్ణ ప్రైవేటీకరణ కాదు, పాక్షిక ఔట్‌సోర్సింగ్ మాత్రమే. ఈ తేడాను దాచిపెడితే వాదన డొల్లగా మారుతుంది. కానీ, ఈ తేడా ఉన్నా దిశ మారదు అనేదే అసలు విమర్శ.
ప్రజలకు ఉచితంగానే పరీక్షలు జరుగుతాయని చెబుతున్నా, ఆ ఖర్చును ప్రభుత్వమే కంపెనీకి యూజర్ చార్జీల రూపంలో చెల్లిస్తుంది. అంటే ప్రజాధనం రోగి జేబు దాటి నేరుగా కంపెనీ ఖాతాలోకి వెళ్తుంది, మధ్యలో ప్రభుత్వరంగ మౌలిక సదుపాయం బలపడకుండానే. ఇంకా ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, ప్రతి స్కాను కూ, ప్రతి పరీక్షకూ కంపెనీకి చెల్లింపు జరిగే ఈ నిర్మాణంలో, ఎక్కువ పరీక్షలు చేయిస్తే కంపెనీకి ఎక్కువ లాభం అనే స్వభావం దాగి ఉంది. అనవసర పరీక్షలు పెరిగే ప్రమాదాన్ని అరికట్టే ఆడిట్ యంత్రాంగం ఏర్పాటు చేయకుండానే ఈ విధానాన్ని తీసుకురావడం, పర్యవేక్షణ లేని దోపిడీకి తలుపులు తెరవడమే.
సొంతంగా మౌలిక సదుపాయాలు నిర్మించుకోకుండా, బీమా కంపెనీలకూ కార్పొరేట్ ఆసుపత్రులకూ బిల్లులు కడుతూ కూర్చున్నందుకే నిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ పూర్వ వైభవం కోల్పోయింది. ఆ గుణపాఠాన్ని పట్టించుకోకుండా, ఇప్పుడు డయాగ్నస్టిక్ రంగంలోనూ అదే బాటలో నడవాలని చూడటం, క్రోనీ క్యాపిటలిజానికి కొత్త ద్వారం తెరవడమే. ప్రభుత్వ దవాఖానాలను శాశ్వతంగా బలహీనంగా ఉంచి, ప్రైవేట్ భాగస్వాములపై ఆధారపడేలా చేయడం అనేది యాదృచ్ఛికం కాదు. ఇది వర్గ ప్రయోజనాల నిర్మాణాత్మక ఎంపిక. పీపీపీ సమర్థకులు తరచూ ఒక వాదన తెస్తారు. ‘రోగుల జేబు నుంచి కాదు కదా, ప్రభుత్వమే కంపెనీకి డబ్బు చెల్లిస్తోంది, మరి నష్టమేముంది?’ అని.
ఈ వాదన మొదటి చూపునకు తర్కబద్ధంగా కనిపించినా, దాని వెనుక ఒక కీలక ప్రశ్నను దాచిపెడుతుంది. అదేమిటంటే ప్రభుత్వం చెల్లించే ఆ సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆకాశం నుంచి ఊడిపడదు. పన్నుల రూపం లో, ఖనిజ సంపద అమ్మకం రూపంలో, భూముల ఆదాయం రూపంలో అది ప్రజల నుంచి, రాష్ట్ర సంపద నుంచే సమకూరుతుంది. అంటే ‘ప్రభుత్వం చెల్లిస్తుంది’ అనే మాట ‘ప్రజాధనం చెల్లిస్తుంది’ అనే వాస్తవాన్ని దాచిపెట్టే మాటల గారడీయే. రోగి జేబు నుంచి నేరుగా వెళ్లకపోయినా, పరోక్షంగా ప్రజల సమష్టి సంపద నుంచే కంపెనీ ఖాతాలోకి ఆ డబ్బు చేరుతుంది, ఈ వాస్తవాన్ని దాచడమే ఈ వాదన అసలు ఉద్దేశం.
విద్య, వైద్యం అనేవి కాంట్రాక్టు పనులు కావు, అవి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఇవి ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకూడదు. అన్ని కులాల్లోని పేదలకూ, శ్రామిక మధ్యతరగతికీ సమానంగా అందుబాటులో ఉండాలి. అలాంటి వ్యవస్థను ప్రభుత్వమే స్వయంగా, శాశ్వత ప్రాతిపదికన నిర్మించినప్పుడే అది నిజమైన సామాజిక న్యాయం అవుతుంది. ప్రతిసారీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడం అంటే, ఈ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడమే, దాన్ని ఎంత సంక్షేమ భాషలో చెప్పినా.
చివరగా, యంత్రాల నిర్వహణ భారం నిజమైన సమస్యే. కానీ, దానికి పరిష్కారం ప్రైవేట్‌కు అప్పగించడం కాదు. సాంకేతిక సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించడం, బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగాలను ప్రతి జిల్లా ఆసుపత్రిలో బలోపేతం చేయడం, మరమ్మతుల కోసం ప్రత్యేక నిధిని ముందస్తుగా కేటాయించడం అసలు పరిష్కారాలు. ఇవి చేయకుండా పీపీపీ వైపు పరుగెత్తడం అంటే, సమస్యను పరిష్కరించడం కాదు, దాన్ని శాశ్వతం చేసి, దాని లాభాన్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టడమే. విద్య తర్వాత వైద్యం కూడా ఇదే బాటలో పోతే, మిగిలేది పేరుకు ప్రభుత్వరంగం, వాస్తవానికి కార్పొరేట్ శాశ్వత కాంట్రాక్టు రాజ్యం.
ప్రజలు కేవలం ప్రజా విద్య, ప్రజా వైద్యం కోసం అర్జీలు పెట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు పాలకులు ప్రజల డిమాండ్లను పట్టించుకోకుండా వదిలేస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే మళ్లీ మళ్లీ ఎన్నికల్లో కొత్త మాటలతో అమ్మేస్తారు తప్ప, అమలు చేయరు. ఈ వాస్తవాన్ని గుర్తించాలంటే ఒక్కటే దారి.. ఇది అర్థించే విషయం కాదు, పోరాడి సాధించాల్సిన హక్కు. ప్రజలే పోరాడాలి, ప్రజలే కదలాలి, అప్పుడే ప్రజా విద్య, ప్రజా వైద్యం వాస్తవ రూపం దాల్చుతాయి.
వ్యాసకర్త: సత్యశోధక మహాసభ ప్రతినిధి, 9948872190






