19-12-2025 02:04:56 AM
బలం పెంచుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎత్తుకు పైఎత్తు
కరీంనగర్, డిసెంబరు 18 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరిగాయి. మొత్తం 1224 పంచాయతీలు ఉండగా కోర్టు కేసులు వివిధ కారణాలతో కొన్ని పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మొదటి విడతలో కాంగ్రెస్ హవా కొనసాగగా, రెండు, మూడు విడతల్లో బీఆర్‌ఎస్ ఆశించిన స్థానాలు దక్కించుకుంది. బీజేపీ సెంచరీ కొట్టింది.
స్వతంత్రులు వంద మందికి పైగానే గెలుపొందారు. స్వతంత్రులతోపాటు ఇతర పార్టీల మద్దతుతో గెలుపొందిన వారిని తమ పార్టీలో చేర్పించుకునే ప్రక్రియను కాంగ్రెస్ ఇప్పటికే ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో స్వతంత్రులను బీజేపీలో చేర్పించే ప్రయత్నం ఆ పార్టీ నేతలు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 500 మందివరకు గెలవగా, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు 296 మంది వరకు గెలుపొందారు. బీజేపీ సెంచరీ దాటింది. స్వతంత్రులు కూడా ఎక్కువ సంఖ్యలోనే గెలుపొందారు.
ఆయా పార్టీలవారు తమ బలాలను ఎక్కువ చేస్తూ ప్రచారం గావిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలవడంతో అధికార కాంగ్రెస్ సర్పంచుల ప్రమాణ స్వీకారానికి ముందే వారిని చేర్పించేకునేందుకు గాలం వేస్తుంది. బీజేపీలో చేరితే ఆ గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామని బీజేపీలో చేర్పించేందుకు గాలం వేస్తున్నారు.
ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు పోటాపోటీగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండడంతో సర్పంచులుగా గెలుపొందిన వారు ఎటు వెళ్లాలో తెలియక కొందరు అయోమయానికి లోనవుతుండగా, ఆయ పార్టీల నుంచి రెబల్ గా గెలుపొందినవారు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నారు.
బీఆర్‌ఎస్ హవా...
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుండి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఆయన దిశానిర్దేశనం చేసి నాయకులను ముందుండి నడిపించడంతో ఈ నియోజకవర్గంలో మరోమారు పార్టీ పట్టును నిరూపించారు. ఇక్కడ బీఆర్‌ఎస్ బలం సెంచరీ దాటింది.
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట మండలాల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచులు కాంగ్రెస్ కంటే ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. ఇక్కడ కూడా పార్టీని పట్టును పదిలం చేసుకుంది.
మంత్రుల ఇలాకలో హస్తం హవా....
మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో మహదేవపూర్, కాటారం, మహముత్తారం మండలాలు భూపాలపల్లిలో, మిగతా మండలాలు పెద్దపల్లి జిల్లాలో, పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు సిద్ధిపేట, కొన్ని మండలాలు హన్మకొండ,
కొన్ని మండలాలు కరీంనగర్ లో ఉన్నాయి. ప్రతి మండలంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. ఈ ఇద్దరు మంత్రుల సమక్షంలో స్వతంత్రులతోపాటు ఇతర పార్టీల మద్దకు గెలుపొందిన పలువురు చేరుతుండడంతో పల్లె రాజకీయం రసవత్తరంగా మారింది.
పుంజుకున్న బీజేపీ...
గతంతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లాలో పుంజుకుంది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50కి పైగా స్థానాలను బీజేపీ బలపర్చిన అభ్యుర్థులు గెలిచారు. హుజూరాబాద్ లో కూడా పట్టును చాటుకుంది. పార్లమెంట్ పరిధిలో 30 వరకు స్వతంత్రులను పార్టీలో చేర్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నది.