09-12-2025 01:07:55 AM
యాదాద్రి జిల్లా మాచనపల్లిలో ఉద్రిక్తత
బొమ్మలరామారం, డిసెంబర్ 8: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మాచనపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తండ్రిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం దాడి చేశాడు. గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ దాసరి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు దాసరి సూర్య ప్రకాష్‌రెడ్డి అధికార పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఆదివారం సూర్య ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లను కలవడానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన దాసరి కృష్ణారెడ్డి (అలియాస్ చిన్నోల్ల కృష్ణారెడ్డి) పొలం వద్ద ఒంటరిగా ఉన్న దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై దాడికి దిగాడు. శ్రీనివాస్‌రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసిన కృష్ణారెడ్డి, ఆయనను గోళ్లతో రక్కుతూ, చెవులను కొరుకుతూ పైశాచికానందం పొందాడు.
అక్కడే చెట్లు నరుకుతున్న కూలీల వద్ద ఉన్న గొడ్డలిని లాక్కొని చంపేస్తానని బెదిరిస్తూ బీభత్సం సృష్టించాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డితో పాటు అక్కడి వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఎన్నికల బందోబస్తులో భాగంగా స్థానిక ఎస్సై బుగ్గ శ్రీశైలం ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుంటుండగా, గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. కాగా కృష్ణారెడ్డి గతంలోనూ గ్రామానికి చెందిన ఇద్దరిపై ఇదే రీతిలో దాడులకు పాల్పడగా, అతడిపై పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దాసరి కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.