ఉచిత విద్యా ప్రాజెక్టు ప్రారంభానికి మెగాస్టార్ సన్నాహాలు
మెగాస్టార్ చిరంజీవి సినిమాలతోపాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్‌బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక సమాజానికి ఉపయోగపడే మరో గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నారు మెగాస్టార్. ఉగాది సందర్భంగా చిరంజీవి స్వయంగా ఈ విష యాన్ని ప్రకటించారు.
‘రక్తం ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నప్పుడు, నా అభిమానులందరినీ రక్తదానంలో పాల్గొనేలా స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. ఆ ఆలోచన నాకు 25 ఏళ్ల క్రితమే కలిగింది. భవిష్యత్తులో పేద ప్రజలకు విద్యను ఎలా అందించాలనే దానిపై ఇప్పుడు ఆలోచిస్తున్నా. నన్ను స్ఫూర్తిగా తీసుకుని నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన్’ను ప్రారంభించారు.
ఇప్పుడు, నేను ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఉచిత విద్యా బోధనను ప్రారంభించాలనుకుంటున్నా. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అవసరమైన చోట ఉచిత విద్యను అందించే దిశగా కృషి చేస్తాను. ఈ కొత్త విద్యా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తాను” అని మెగాస్టార్ వెల్లడించారు.




