3 September, 2026 | 1:26 AM

తెలంగాణ విముక్తి పోరు కెరటం!

03-09-2026 | 12:00am

రామకిష్టయ్య సంగనభట్ల :

నేడు జమలాపురం కేశవరావు జయంతి

నిజాం నిరంకుశ పాలన(Nizam autocratic rule) ఇనుప పాదాల కింద నలిగిపోయిన తెలంగాణ(Telangana) నేలమీద ఆత్మగౌరవ(Self-esteem) పతాకాన్ని సమున్నతంగా ఎగరేసిన అరుదైన ప్రజా నాయకుడు(People Leader) ‘తెలంగాణ సర్దార్(Telangana Sardar)’ జమలాపురం కేశవరావు(Jamalapuram Keshavarao). భూస్వామ్య రాచరికపు వెట్టిచాకిరీ బంధనాల నుంచి సామాన్యుడిని విముక్తుడిని చేయడానికి తన సంప న్న జమీందారీ వైభవాన్ని, సర్వస్వాన్ని తృ ణప్రాయంగా త్యజించిన త్యాగశీలి ఆయన.

కళ్లెదుట జరుగుతున్న దోపిడీని, దౌర్జన్యాలను చూస్తూ మౌనంగా ఉండలేక రగి లిపోయిన ఆయన ఆవేశం, కార్యాచరణగా మారి దక్కన్ పీఠభూమిలో స్వాతంత్య్ర పోరాట(Freedom struggle) జ్వాలలను రగిలించింది. సత్యాగ్రహి గా, గ్రంథాలయోద్యమ కర్తగా, ఆంధ్ర మహాసభ సారథిగా, పీడిత తాడిత వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన కేశవరావు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను గుర్తు చేసే ధైర్యసాహసాలను ప్రదర్శించి ‘దక్కన్ సర్దార్’, ‘తెలంగాణ కేసరి’గా ప్రజల హదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

తెలంగాణ నేల సాంస్కృతిక బానిసత్వంలో మగ్గుతున్న రోజుల్లో, 1908 సెప్టెం బర్ 3న నాటి వరంగల్ జిల్లా(Warangal District) (నేటి ఖ మ్మం జిల్లా) ఎర్రుపాలెంలో జమలాపురం వెంకట రామారావు, వెంకట నరసమ్మ దంపతులకు కేశవరావు జన్మించారు. ఎ ర్రుపాలెంలో ప్రాథమిక విద్యనభ్యసించిన అనంతరం ఉన్నత చదువుల కోసం నిజాం కళాశాలలో అడుగుపెట్టిన నాటినుంచే ఆ యనలోని తిరుగుబాటు తత్వం స్పష్టంగా వ్యక్తమైంది.

ఆ రోజుల్లో ఓయూ పరిధిలో, విద్యాసంస్థల్లో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలాపించడాన్ని నిజాం పాలకవర్గం తీవ్ర నేరంగా పరిగణించి నిషేధించింది. ఈ ఆం క్షలను వ్యతిరేకిస్తూ కళాశాల విద్యార్థులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి నిరసనోద్యమా నికి నేతృత్వం వహించారు కేశవరావు. తమ భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తే తరగతులనే బహిష్కరిస్తామని సింహగర్జన చేసి, చివరికి నిజాం ప్రభుత్వాన్ని దిగివచ్చే లా చేశారు. ఈ విజయంతో విద్యార్థి దశలోనే ఆయనలోని ఉద్యమ నేత ప్రపంచా నికి పరిచయమయ్యారు.

యుక్తవయసులోనే మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, సహాయ నిరాకరణ సిద్ధాంతాలకు కేశవరావు ఆకర్షితులయ్యారు. 1923లో రాజమండ్రిలో గాంధీజీ ప్రసంగాన్ని విని ప్రేరణ పొందిన ఆయన, 1930లో విజయవాడ పర్యటన లో బాపూజీని స్వయంగా కలిసి ఉద్యమ కార్యాచరణను విస్తరించారు.

నిజాం పాలనలో ప్రజలను అజ్ఞానంలో ఉంచడమే పా లకులకు శ్రీరామరక్షగా మారిన తరుణంలో, మాడపాటి హనుమంతరావు ఆరంభించిన గ్రంథాలయోద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. అక్షరం ద్వారానే చైతన్యం సాధ్యమని నమ్మి, తెలంగాణలోని పల్లెపల్లెకూ గ్రంథాలయాలను విస్తరింపజేశారు. వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు నెలకొల్పి దళిత, గిరిజన వర్గాల విద్యోన్నతికి, అంటరానితన నిర్మూలనకు అహర హం శ్రమించారు.

1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భవించినప్పుడు సంస్థాగత నిర్మాణం లో వెన్నుదన్నుగా నిలిచి, ఆ సంస్థ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది సెప్టెంబర్ 24న మధిరలో గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, రావి నారాయణరెడ్డి ప్రభృ తులతో కలిసి సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నారు.

సర్దార్‌ను అడ్డుకోవడానికి నిజాం పోలీసులు ఊరంతా పహారా కాసినా, వారి కళ్లుగప్పి ఒక సామాన్య రైతు వేషం లో వేదికపైకి దూసుకొచ్చి ‘మహాత్మాగాంధీకి జై’, ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌కు జై’ అంటూ గర్జించి సత్యాగ్రహం ప్రారంభించిన తీరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లి ఖించదగిన ఘట్టం. ఈ ధిక్కారానికి ఫలితంగా ఆయనకు 18 నెలల కారాగార శిక్ష పడింది. వరంగల్, నిజామాబాద్ జైళ్లలో నిర్బంధాన్ని అనుభవించినా ఆయన సంక ల్పం ఇసుమంతైనా సడలలేదు.

1942 నాటి క్విట్ ఇండియా పిలుపును తెలంగాణ పల్లెల్లో ప్రతిధ్వనింపజేసి ఉద్యమ రథసారథిగా నిలిచారు. 1946లో మెదక్ జిల్లా కందిలో ఆయన అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్ర మహాసభ తెలంగాణ ప్రజల పోరాట పటిమను దశదిశలా చాటిచెప్పిం ది. భారత స్వాతంత్య్ర సంబరాలు సమీపిస్తున్న వేళ, 1947 ఆగస్టు 7న మధిరలో సత్యాగ్రహాన్ని నడిపినందుకుగాను నిజాం ప్రభుత్వం ఆయనకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దేశమంతా స్వతంత్ర కాంతుల్లో మునుగుతుంటే, తెలంగాణ స్వేచ్ఛ కోసం ఈ ధీరుడు నిజాం జైలు చీకట్లలో బందీగా మిగిలారు.

1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ ద్వారా హైదరాబా ద్ సంస్థానం విముక్తి పొంది భారత యూ నియన్‌లో విలీనమైన తర్వాత, కేశవరావు మరింత నిక్కచ్చిగా వ్యవహరించారు. ని జాం విముక్తి పేరిట మిలిటరీ గవర్నర్ జె.ఎన్.చౌధురి యంత్రాంగం, ముఖ్యంగా ప్రత్యేక అధికారి నంజప్ప కమ్యూనిస్టుల ఏరివేత ముసుగులో గ్రామీణులపై, మైనారిటీలపై సాగించిన హింసా కాండను, అధికార పక్షంలో ఉండి నిలదీసిన ఏకైక ధైర్యశాలి కేశవరావు.

డోర్నకల్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం ఆయన నిర్భీతికి తిరుగులేని తార్కాణం. ఏ ప్రభుత్వమైనా అమాయక ప్రజలపై అత్యాచారాలు జరపడాన్ని సహించేది లేదని, నంజప్ప చర్యలు నిజాం తొత్తులైన జాగీర్దార్లను తలపిస్తున్నాయని, నంజప్ప తెలంగాణకు రక్షకుడి గా కాక భక్షకుడిగా తయారయ్యాడని గర్జించారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం తెరపైకి వచ్చిన తరుణంలో కేశవరావు ప్రద ర్శించిన ముందుచూపు తెలంగాణ చరిత్ర లో ప్రశంసనీయం. తెలంగాణ ప్రత్యేక భౌ గోళిక, సాంస్కృతిక, ఆర్థిక అస్తిత్వాన్ని ఆ యన గట్టిగా సమర్థించారు. శతాబ్దాల భూ స్వామ్య దోపిడీతో చితికిపోయిన తెలంగాణను సరైన రక్షణలు, విద్యా, ఆర్థిక స్వ యంసమృద్ధి లేకుండా కోస్తాంధ్రతో కలిపి ‘విశాలాంధ్ర’గా ఏర్పాటు చేస్తే, స్థానిక ప్రజ ల ప్రయోజనాలు దెబ్బతింటాయని, స్థానికేతరుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆ యన ఆనాడే స్పష్టంగా హెచ్చరించారు. బ హుభాషా సంస్కృతితో కూడిన హైదరాబాద్ రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగిం చడమే ప్రజల శ్రేయస్సుకు మార్గమని వాదించిన దార్శనికుడు ఆయన.

పార్టీ అధ్యక్షుడిగా ఉంటూనే సభాస్థలి వద్ద స్వయంగా పందిళ్లు వేసేంతటి నిరాడంబరత ఆయన సొంతం. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించారు. అయితే, నిస్వార్థ సేవను ఆరాధించాల్సిన రాజకీయాల్లో కపటత్వం, అంతర్గత కుట్రలు ఆయన ఎదుగుదలను దెబ్బతీశాయి.

నిర్భయంగా నిజాలు మాట్లాడే ఆయన స్వభావం స్వపక్షంలోని కుహనా నాయకులకు కంటగింపుగా మారింది. కఠిన జైలు జీవితం, దీనికితోడు సొంత పార్టీ నేతల వెన్నుపోటుతో తీవ్ర మనస్తాపానికి గురైన కేశవరావు, 1953 మార్చి 29న 46 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. పదవులను కాంక్షించక ప్రజల ఆత్మగౌరవాన్నే ఊపిరిగా భావించి, తెలంగాణ విముక్తి కోసం జీవితాన్ని ధారపోసిన ఈ ‘దక్కన్ సర్దార్’ త్యాగం, నిబద్ధత, నిర్భీతి భావితరాలకు నిత్య స్ఫూర్తిదాయకం. 

 వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494