3 September, 2026 | 2:20 AM

పేదల ఇంట్లో మద్యం విషాదం

03-09-2026 | 12:00am

అమర్‌నాథ్ సారంగుల :

తెలంగాణ ప్రభుత్వానికి మద్యం(Alcohol) ప్రధాన ఆదాయ వనరుగా కనిపిస్తుండవచ్చు. కానీ, అదే మద్యం వేలాది కుటుంబాల్లో అనారోగ్యం(illness), అప్పులు(debts), గృహహింస(domestic violence), ప్రమాదాలు, అకాలమరణాలు, అనాథలవుతున్న పిల్లలు, చిన్న వయసులోనే వైధవ్యాన్ని ఎదుర్కొంటున్న మహిళల రూపంలో తీవ్రమైన సామాజిక విషాదాన్ని సృష్టిస్తోంది. మద్యం అమ్మకాల ద్వారా ఖజానాకు చేరుతున్న ప్రతి రూపాయినీ ప్రభుత్వం లెక్కిస్తోంది.

కానీ దాని కారణంగా కూలిపోతున్న కుటుంబాలు, ఆరిపోతున్న మాంగల్యాలు, దిక్కులేని స్థితిలో పడుతున్న మహిళల సంఖ్యను మాత్రం సమగ్రంగా లెక్కించ డం లేదు. తాజా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6 (2023-24) నివేదిక ప్రకారం తెలంగాణలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. జాతీయ సగటు కేవలం 18.9 శాతం. మహిళల్లో కూడా తెలంగాణ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

రాష్ర్టంలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో 7.1 శాతం మంది మద్యం సేవిస్తుండగా, జాతీయ సగటు 1.1 శాతమే. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ ప్రకారం 43.4 శాతంగా ఉన్న తెలంగాణ పురుషుల మద్యం వినియోగం, ఇప్పుడు 43.9 శాతానికి చేరింది. ఈ గణాంకాలతో పాటు తాజాగా తెలంగాణలో వితంతు పింఛన్ కోసం వ చ్చిన దరఖాస్తుల సంఖ్య మరింత కలవరపెడుతోంది. 2026 ఆగస్టు 31 నాటికి సామాజిక భద్రతా పింఛ న్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 4,81,662 కొత్త దరఖాస్తులు వచ్చాయని తెలుస్తున్నది.

వాటిలో ఏకంగా 2,89, 342 దరఖాస్తులు వితంతు పింఛన్‌కు సంబంధించినవే. ఇది మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 60 శాతం. అంతేకాకుండా దరఖాస్తుల గడువును 2026 సెప్టెంబర్ 15 వరకు పొడిగించినందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు లక్షలకు పైగా వితంతు పింఛన్ దరఖాస్తులు రావడం తెలంగాణ సమాజంలో వైధ వ్యం, మహిళల ఆర్థిక అభద్రత ఎంత విస్తృతంగా ఉన్నాయో తెలియజేసే తీవ్రమైన హెచ్చరిక.

వీరిలో ఎంతమంది చిన్న వయసులోనే భర్తలను కోల్పోయారు? ఎంతమంది భర్తలు మద్యం సంబంధిత కాలేయ వ్యాధు లు, గుండె జబ్బులు, ప్రమాదాలు లేదా ఆత్మహత్యల వల్ల మరణించారు? ఎంతమందికి చిన్న పిల్లలు ఉన్నారు? ప్రభుత్వం వద్ద ఈ ప్రశ్నలకు సమగ్ర సమాధానం లేదు. 2026లో జర్నల్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ రాష్ట్రాలవారీ ప్రచురించిన అధ్యయనం మరింత ఆందోళనకరమైన వాస్తవాన్ని వెల్లడించింది.

2021 నాటికి తెలంగాణలో 45 ఏళ్లలోపు వివాహమైన లేదా గతంలో వివాహమైన మహిళల్లో 5.2 శాతం మంది వితంతువులు కాగా, జాతీయ సగటు 2.7 శాతమే. ఇదే వయోవిభాగంలో కర్ణాటక, తమిళనాడులో 3.9 శాతం, మహారాష్ట్రలో 3 శాతం, కేరళలో 1.8 శాతమే నమోదైంది. దేశంలో యువ మహిళల వైధవ్యం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల సరసన తెలంగాణ నిలవడం ఒక సాధారణ సంక్షేమ గణాంకం కాదు; అది రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థకు, సామాజిక విధానానికి ప్రమాద సంకేతం.

తెలంగాణలో సుమారు 30.8 శాతం వివాహిత మహిళలు భర్త చేతిలో శారీరక లేదా లైంగికహింసను ఎదుర్కొన్నారు. భర్త మద్యం సేవించని కుటుంబా ల్లో వైవాహిక హింస 23 శాతంగా ఉండగా, అప్పుడప్పుడు మద్యం సేవిం చే భర్తల కుటుంబాల్లో అది 44 శాతానికి పెరిగింది. తరచుగా మత్తులో ఉండే భర్తల కుటుంబాల్లో ఏకంగా 70 శాతం మహిళలు హింసను ఎదుర్కొన్నట్లు సర్వే సూచించింది.

తెలంగాణలో మద్యం ప్రధానంగా పురుషులు సేవిస్తున్నప్పటికీ, దాని సామాజిక, ఆర్థిక మూల్యాన్ని మహిళలు, పిల్లలే ఎక్కువగా చెల్లిస్తున్నారు. అయితే ‘తెలంగాణలో ఇంతమంది మహిళలు మద్యం కారణంగా వితంతువులయ్యారు’ అని కచ్చితంగా చెప్పడానికి ఆధారాలు లేవు. ప్రభుత్వ వైఫల్యం కూడా ఇదే. మద్యం ద్వారా వస్తున్న ఆదాయం ప్రభుత్వ ఖజానాలో కనిపిస్తోంది; కానీ దానివల్ల కూలిపోతున్న కుటుంబాల కన్నీళ్లు ఏ ప్రభుత్వ లెక్కల్లోనూ కనిపించడం లేదు.

 వ్యాసకర్త: బీజేపీ సీనియర్ నాయకులు, 8074162333