అణచివేతపై పోరు కెరటం
నేడు దొడ్డి కొమరయ్య వర్ధంతి :
తెలంగాణ జనజీవన పోరాట చరిత్రలో జూలై 4వ తేదీ కేవలం ఒక క్యాలెండర్ పేజీ కాదు; అది రక్తాక్షరాలతో లిఖితమైన ఓ విప్లవ అధ్యాయం. ఆ రోజే తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నిరంకుశ ఫ్యూడల్ వ్యవస్థ గుండెల్లో నినదిస్తూ వీరమరణం పొందారు. పీడిత ప్రజల జీవన హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పందొమ్మిదేళ్ల ప్రాయంలోనే ప్రాణాలర్పించిన ఈ వీరుని గాథ సార్వకాలిక మానవ హక్కుల పోరా టాలకు దిక్సూచిగా నిలుస్తుంది.
ఈ చారిత్రాత్మక పోరాట పూర్వాపరాలను నిశితంగా పరిశీలిస్తే, నాటి హైదరాబాద్ సంస్థానంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎంతటి దయనీయమైనవో స్పష్టమవుతుంది. అసఫ్‌జాహీల పాలనలో నిజాం నవాబు స్థానిక దొరలు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లను ప్రజా పీడనకు సాధనాలుగా వాడుకున్నారు. నాడు అమల్లో ఉన్న వెట్టి చాకిరి విధానం తెలంగాణ సమాజాన్ని బానిసత్వంలోకి నెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో అణగారిన ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని, హక్కుల పట్ల అవగాహనను కల్పించడానికి ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలు మార్గదర్శక పాత్ర పోషించాయి.
ఈ క్రమంలోనే నాటి వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడివెండి గ్రామంలో 1927 ఏప్రిల్ 3న దొడ్డి కొమరయ్య జన్మించారు. కొమరయ్య అన్న దొడ్డి మల్లయ్య అప్పటికే ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తుండటంతో, ఆ ప్రభావం కొమరయ్యపై బలంగా పడింది. నిరంకుశత్వానికి పరాకాష్టగా నిలిచిన దేశ్‌ముఖ్ విస్నూరు రామచంద్రారెడ్డి, ఆయన తల్లి జానకమ్మల దౌర్జన్యాలకు నాటి కడివెండి ప్రధాన కేంద్రంగా ఉండేది.
వారి దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు దొడ్డి మల్లయ్య, కొమరయ్యల నేతృత్వంలో గ్రామంలో రక్షణ దళాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే 1946 జూలై 4న తెలంగాణ చరిత్ర గతిని మార్చిన ఆ ఘోరం జరిగింది. విస్నూరు దొర అనుచరులు, రజాకార్లు కడివెండి ప్రజలపై, ముఖ్యంగా ఐలమ్మ భూపోరాటానికి మద్దతుగా నిలిచిన వారిపై దాడికి దిగారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ దేశ్‌ముఖ్ గడీ ముట్టడికి గ్రామస్థులు వేలాదిగా తరలివచ్చారు. దీనికి దొడ్డి మల్లయ్య, కొమరయ్య నాయకత్వం వహించారు.
శాంతియుతంగా సాగుతున్న ప్రజా రథాన్ని చూసి తట్టుకోలేని దేశ్‌ముఖ్ బంట్లు, రజాకార్లు తుపాకుల తో కాల్పులకు తెగబడ్డారు. శత్రువుల తు పాకీ బుల్లెట్ నేరుగా దొడ్డి కొమరయ్య ఛా తీలో దూసుకుపోయింది. కొమరయ్య అక్కడికక్కడే వీరమరణం పొందారు. కొమరయ్య అమరత్వం నాటి సాయుధ పోరాటానికి దావాగ్ని లాంటి ఉధృతిని ఇచ్చింది. ఆయన మరణ వార్త విన్న తెలంగాణ పల్లెలు ఆగ్రహంతో రగిలిపోయాయి.
1946- 1951 వరకు ఉవ్వెత్తున సాగిన ఈ సాయుధ పోరాటంలో దాదాపు 4000 మంది వీరులు ప్రాణాలర్పించారు. ఈ విప్లవం ఫలితంగానే 3000 గ్రామాల్లో భూస్వాముల పట్టు సడలి, 10 లక్షల ఎకరాల భూమి పేదల సొంతమైంది. ఈ మహోద్యమ తీవ్రతకు తలవంచిన నిజాం రాజరికం అంతిమంగా కుప్పకూలింది. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైంది.
ఈ విలీనానికి, విముక్తికి పునాది రాయి దొడ్డి కొమరయ్య త్యాగమేననడంలో ఎలాంటి సందేహం లేదు. దశాబ్దాల తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కూడా కొమరయ్య చూపిన పోరాట పటిమ, ఆత్మగౌరవ నినాదాలే ప్రధాన స్ఫూర్తిగా నిలిచాయి.
నేటికీ ప్రజాస్వామ్య రక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం సాగే ప్రతి ఉద్యమ జెండాపై ఆయన పేరు ప్రకాశిస్తూనే ఉంది. శతాబ్దాల అణచివేతపై ఉదయించిన ఆ విప్లవ భానుని కీర్తి తెలంగాణ మట్టి ఉన్నంత కాలం శాశ్వతంగా వెలుగుతూనే ఉంటుంది.
రామకిష్టయ్య సంగనభట్ల
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494






