విమానానికి వేలం
- దేశంలోనే మొదటిసారి
- ఫాల్కన్ స్కాం కేసులో ఈడీ సంచలన నిర్ణయం
- రూ.3 కోట్లకు అమ్మకం
- బాధితులకు అందనున్న సొమ్ము
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) ఓ విమానాన్ని వేలం ద్వారా విక్రయించింది. హైదరాబాద్‌కు చెందిన ఫాల్కన్ గ్రూప్ (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్) పోంజీ మోసానికి పాల్పడగా, ఆ కేసులో సీజ్ చేసిన హాకర్ 800ఏ ప్రైవేట్ విమానాన్ని ఈడీ వేలం వేసింది.
ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ద్వారా జూలై 1న ఈ-వేలం నిర్వహించారు. రూ.3 కోట్లకు విమానం అమ్ముడు పోయినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు.
ఈ విమానాన్ని గత ఏడాది మార్చి 7న శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. ఫాల్కన్ గ్రూప్ సంస్థ చైర్మన్ అమర్‌దీప్‌కుమార్ రూ.792 కోట్ల మేర ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. అమర్‌దీప్‌కుమార్‌తో పాటు మరికొందరిపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతోనే నిందితులు ఈ విమానాన్ని కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు.
దర్యాప్తులో భాగంగా విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. విక్రయించడంతో వచ్చిన రూ.3 కోట్లను మోసపోయిన బాధితులకు చెల్లించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని.. మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసిన విమానాన్ని ఈడీ వేలం వేసి విక్రయించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం.






