4 July, 2026 | 1:07 AM

సామాన్యుడికి చికెన్ ‘షాక్’..

04-07-2026 12:32 AM

కొండెక్కిన కోడిగుడ్డు ధరలు

చికెన్ కిలో రూ. 330 

కోడిగుడ్డు ధర ఒకటి రూ.8

మేడ్చల్ అర్బన్, జూలై 3 (విజయక్రాంతి): ఒకప్పుడు సామాన్యుడికి సైతం సులభంగా అందుబాటులో ఉండే చికెన్, కోడిగుడ్లు ప్రస్తుతం బాగా పెరిగాయి. గత కొన్ని వారాలుగా వీటి ధరలు ఒక్కసారిగా దూసుకుపోవడంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్వెజ్ ప్రియులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్ల వైపు వెళ్లడానికే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 280 నుంచి రూ.300 మధ్య ఉండేది. కానీ ప్రస్తుతం రూ. 300 నుంచి రూ. 330 వరకు పలుకుతోంది. కొన్ని రిటైల్ మార్కెట్లలో మరియు లోకల్ దుకాణాల్లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఇంకా ఎక్కువ ధరలకే అమ్ముతున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

కొండెక్కిన గుడ్డు ధర 

చికెన్తో పోటీ పడుతూ కోడిగుడ్ల ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం నెల రోజుల క్రితం వరకు రూ. 6 నుంచి రూ. 7 మధ్య పలికిన ఒక్కో గుడ్డు ధర, ప్రస్తుతం రూ. 8 కి చేరుకుంది. ‘ప్రొటీన్ కోసం రోజువారీ ఆహారంలో గుడ్లపై ఆధారపడే మాలాంటి కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారింది. ఇప్పుడు 30 గుడ్లు ఉన్న ఒక ట్రే కొనాలంటే ఏకంగా రూ. 240 ఖర్చు చేయాల్సి వస్తోంది.

ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి?

పౌల్ట్రీ రంగ నిపుణుల ప్రకారం.. ప్రస్తుత ఎండ తీవ్రత లేదా వాతావరణ మార్పుల వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గడం, మేత (ఫీడ్) ధరలు పెరగడం, రవాణా ఖర్చులు భారం కావడమే ఈ హఠాత్తు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ధరలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నాన్వెజ్ ముక్క ముట్టాలన్నా, గుడ్డు తినాలన్నా సామాన్యుడు తీవ్రంగా ఆలోచించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.