4 July, 2026 | 12:38 AM

రూ ,10 కోట్లతో అంజన్న ఆలయ అభివృద్ధి

04-07-2026 12:00 AM

 నేడు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కల్వకుర్తి ఊరుకొండ జూన్ 3 : సీఎం రేవంత్ రెడ్డి ఊరుకొండ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 10 కోట్లతో ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి చేపట్టేందుకు ప్రణాళికలు చేశారు.  శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులకు భూమి పూజ చేయనున్నారు. 

అభివృద్ధి  పనుల్లో భాగంగా రూ.12 లక్షలతో శ్రీ సింధూర్ గణపతి ఆలయం, రూ.14 లక్షలతో గణపతి మండపం, రూ.50 లక్షలతో 100 అడుగుల విస్తీర్ణంలో పవిత్ర కోనేరు, రూ.20 లక్షలతో ఆలయ సుందరీకరణ, ప్రాకారం, సాలహారం, ఫ్లోరింగ్, పెయింటింగ్, వాటర్ప్రూఫింగ్ తదితర పనులు చేపట్టనున్నారు. అలాగే రూ.6 లక్షలతో నవగ్రహ మండపం, రూ.30 లక్షలతో శివాలయం నిర్మించనున్నారు.

భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ రూ.1 కోట్లతో విశాలమైన కేశఖండన శాల, రూ.1.20 కోట్లతో సత్యనారాయణ స్వామి వ్రత మండపం, రూ.8 లక్షలతో రామానుజకూటం, ప్రసాద తయారీ కేంద్రం, స్టోర్రూమ్, రూ.70 లక్షలతో అన్నప్రసాద వితరణ శత్రం ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి వందలాది మంది భక్తులు వ్రతాలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనేలా ఈ నిర్మాణాలు ఉండనున్నాయి.

దేవస్థానంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా 90 కిలోలీటర్ల సామర్థ్యంతో ఓవర్హెడ్ రిజర్వాయర్కు రూ.45 లక్షలు, 100 కిలోలీటర్ల గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్కు రూ.50 లక్షలు వెచ్చించనున్నారు. పైప్లైన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. కొండపైకి వెళ్లే భక్తులకు సౌకర్యంగా సుమారు 2.5 కిలోమీటర్ల పొడవున ఘాట్ రోడ్డు, మాడవీధి నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించారు. దీంతో వాహనాల రాకపోకలు సులభతరం కావడంతో పాటు ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి.