4 July, 2026 | 12:38 AM

ఫారాలు చేతికిచ్చి.. చేతులు దులుపుకొంటున్న కొందరు బీఎల్‌ఓలు!

04-07-2026 12:00 AM
  1. మేము నింపం.. మీరే నింపుకోండి’ అంటున్న వైనం..
  2. బాధ్యత నుంచి తప్పుకుంటున్నారనే ఆరోపణలు
  3. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అయోమయం.. ఓటు కోల్పోతామేమోనని ఆందోళన

వనపర్తి, జూలై 03 ( విజయక్రాంతి ) : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పలుచోట్ల బీఎల్వోల తీరుపై వనపర్తి పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో బి ఎల్ ఓ లకు కేటాయించిన వార్డు లో వారు ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేస్తున్నప్పటికీ, వాటిని ఎలా నింపాలి, ఏ పత్రాలు జత చే యాలి అనే విషయాల్లో సహాయం చేయకుండా ‘మేము ఫారాలు నింపం... ఎవరి ఫా రాలు వాళ్లే నింపుకోవాలి.

తప్పులు వస్తే మా కు బాధ్యత లేదు‘ అంటూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు బహిరంగానే వినిపిస్తున్నాయి.

ఇప్పటికే క్లిష్టంగా ఉన్న ఫారాలు చదువుకున్న వారికే పూర్తిగా అర్థం కాక ఇబ్బందులు పడుతుంటే, నిరక్షరాస్యులు, వృద్ధులు, గిరిజనులు, దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓటు హక్కును కాపాడే ప్రక్రియ ప్రజలకు మరింత భారంగా మారిందని అంటున్నారు. మరోవైపు, నింపిన ఫారాలను గడువులోపు సమర్పించకపోతే ఓటు తొలగిపోతుందనే ప్రచారం ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది.

దీంతో చాలామంది తమ ఓటు ఉంటుందో లేదో అనే అనుమానంలో అధికారుల కార్యాలయాల, బి ఎల్ ఓ ల చుట్టూ తిరుగుతున్నారు. ఫారాలు ఎలా నింపాలో ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బి ఎల్ ఓ లదే .....ఒకవైపు ఫారాలు ఎలా నింపాలో ఓటర్లకు అవగాహన కల్పించాలని, వివరాలను బీఎల్వోలే పరిశీలించాలని ఈ నెల 2 వ తేదిన అదనపు కలెక్టర్ ( రెవిన్యూ ) వినోద్ కుమార్,  జిల్లా యంత్రాంగం ఆదేశిస్తుండగా.. మరోవైపు ’మేము ఫారాలు నింపం..

మీరే నింపుకోండి’ అని కొందరు బీఎల్వోలు చెబుతున్నారనే ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  జిల్లా ఎన్నికల అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి ....బీఎల్వోలకు సరైన శిక్షణ ఇచ్చారా? ప్రజలకు సహాయం చేయాల్సిన సిబ్బంది బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా సాగేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.