16-11-2025 05:44:04 PM
నకిరేకల్ (విజయక్రాంతి): రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వంటెపాక వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలో మినీ గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్(సిఐటియు అనుబంధం) జనరల్ బాడీ సమావేశం పి రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగంలో జీవనోపాధికై అనేక మంది కార్మికులు డ్రైవర్స్, ఓనర్స్ గా క్లీనర్స్ గా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.
డ్యూటీ చేసే క్రమంలో కార్మికులకు ప్రమాదం జరిగినప్పుడు కాళ్లు చేతులు విరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి జీవనానికి భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డులో రవాణా రంగ కార్మికులను చేర్చి వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల ప్రమాద బీమా పిఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం యూనియన్ కార్యదర్శి ఎం మల్లేష్ సుధాకర్, యాదయ్య, శ్రీను, జానయ్య, శ్రీను పాల్గొన్నారు.