ఎగ్జిట్ పోల్స్ కాదు.. అవి మోదీ పోల్స్
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాహుల్ విమర్శ
కొన్ని నెలల ముందే సిద్ధం చేశారన్న అఖిలేశ్ యాదవ్
న్యూఢిల్లీ, జూన్ 2 : లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని.. మోదీ పోల్స్ అని అభివర్ణించారు. ఇండియా కూటమి 295 సీట్లకు పైగా సాధిస్తుందని జోస్యం చెప్పారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ రోజు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీడియాను తమ వైపు తిప్పుకొని ఇష్టానుసారంగా ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ విడుదల చేయించిందని రాహుల్ మండిపడ్డారు.
అనుకూల మీడియాతో బీజేపీ తప్పుడు ప్రచారం
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని నెలల ముందే బీజేపీ అనుకూలంగా సిద్ధం చేశారని, ఎగ్జిట్ పోల్స్‌ను వాడుకొని సోమవారం ప్రారంభమయ్యే షేర్ మార్కెట్ నుంచి లబ్ధి పొందాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు నిరాశలో ఉన్నారని, ఆ నిరాశను పోగొట్టుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వచ్చేలా చేసుకున్నారని అఖిలేష్ విమర్శించారు. ఎన్నికల కౌంటింగ్ రోజున ఈవీఎంలను నిశితంగా పరిశీలించాలని ఇండియా కూటమిలోని పార్టీలకు ఆయన సూచించారు. బీజేపీ అనుకూల మీడియా బీజేపీకి 300 సీట్లు దాటుతాయని చెబుతోందని, దీని ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.






