ఇప్పుడు వాటికి అర్థాలు మారిపోయాయి

01-05-2024 12:15:00 AM

సినీ ప్రయాణంలో సంభాషణల రచయితగా ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్నారు అబ్బూరి రవి. ఆయన మాటలు రాసిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా విశేషాలు మరియు ఆయన దర్శకత్వ ప్రయత్నాల గురించి సినీ విలేకరులతో పంచుకున్న మాటలివే. 

ఈ సినిమా మీరు చేసేలా ప్రేరేపించిన అంశాలేమిటి?

ఉద్యోగం, పెళ్లి ఈ రెండూ అయితే సెటిల్ అయినట్టే అనుకుంటున్నారంతా. దాని గురించే ఈ సినిమాలో “సెటిల్‌మెంట్ అంటే ఉద్యోగం, పెళ్లి కాదు. మనకి ఒక అవసరం వచ్చినప్పుడు పక్కవాడి దగ్గర చేయి చాచకపోవడం” అనే డైలాగ్ ఉంటుంది. ఒకప్పుడు ఇరవై ఏళ్ళు నిండితే జరిగే పెళ్లి, ఇప్పుడు ఆ వయసు కూడా దాటుతోంది. ఆ మాటకొస్తే ఎప్పుడు చేసుకుంటారో తెలీయని పరిస్థితి. అన్నిటికీ అర్థాలు మారిపోయాయి. పూర్తిగా శాస్త్రోకతమైన పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల ఒకరకమైన విద్యుతావేశం ప్రవహిస్తుంది. స్త్రీ, పురుషల ఎనర్జీని బ్యాలెన్స్ చేసే ప్రక్రియ అది. ఆ సమయంలో ఆత్మస్థానాన్ని చూడమని చెబుతారు. ఇదంతా లెక్కలేని వైనం చూస్తూనే ఉన్నాం. పెళ్లి ఎంత ఆలస్యం అయితే అంత ఆనందపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే కారణంతో మానసికంగా కుంగిపోయే వారూ వుంటారు. నిజానికి ఇది చాలా క్లిష్టమైన విషయం.

సీరియస్ విషయాన్ని వినోద భరితంగా చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు..

దర్శకుడు మల్లి అంకం రాసిన ఈ కథలో హాస్యంతో పాటు గుండెకు హత్తుకునే అంశాలు కూడా ఉంటాయి. వాటికి బాగా కనెక్ట్ అవుతారు. అలా అని ప్రత్యేకించి మెసేజ్ ఇచ్చే పనులేం పెట్టుకోలేదు. ఒక జీవితానుభవంలా అన్నీ అంశాలు ఉంటాయి.

పాత టైటిల్ ని వాడటం గురించి..

ఈవీవీ గారి క్లాసిక్ సినిమా. భయం ఉంటుంది. అయితే నరేశ్ దీనిని ప్రతిపాదించారు. తర్వాత ఎంత వరకు సబబు అని అందరం ఒకటికి పదిమార్లు అనుకుని ఈ నిర్ణయానికొచ్చాం.

సినిమా అంతా పెళ్లి గురించే అంటున్నారు. ఎలాంటి అంశాలను ప్రస్తావించారు?

పెళ్లి విషయంలో భాగంగా ముందుగా ఇంట్లో పెళ్లి చూపులు ఉండేవి. దాని ద్వారా ఆయా కుటుంబాల సాంఘిక పరిస్థితులు తెలిసేవి. ఇప్పుడు హోటల్స్, ఆన్‌లైన్ వంటి వాటిలో జరుగుతుండటం వల్ల వాటి గురించే తెలిసే అవకాశం తక్కువ. పవిత్రమైన పెళ్లిని అంత తేలిగ్గా తీసుకోకూడదు కదా. బంధం బలంగా నిలబడాలంటే చాలా జాగ్రత్తలు అవసరం. అలాంటివి కొన్ని ఇందులో చూపించే ప్రయత్నం చేశాం. అదీ ప్రేక్షకులు మెచ్చే రీతిలోనే.

ఇలాంటి సీరియస్ విషయానికి కామెడీ ఎలా జోడించారు. ఆ సమన్వయం ఎలా కుదిరింది?

ఈ సినిమాలో పాత్రలు, పరిస్థితుల నుండే హాస్యం పుడుతుంది. సన్నివేశాల్లో అలాంటి బలం ఉంటే కామెడీ అద్భతంగా రాయచ్చు. ఇందులో నరేశ్  జామి లివర్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు విపరీతంగా నవ్విస్తాయి. పెళ్లి కాని ప్రతివారు ఆశించే అంశాలతో కూడిన క్లీన్ ఎంటర్‌టైనర్.

కామెడీ.. సీరియస్ పాత్రల్లో, నరేశ్  గారికి ఏది బాగా నప్పుతుందని మీకనిపిస్తుంది?

నటుడిగా ఆయన అన్ని పాత్రలు చేయగలరు. అయితే మనమే చాలా వరకు ఆయన అల్లరికి ఎక్కువగా అలవాటయ్యాం. గాలి శీను పాత్ర అయినా, ‘నేను’ సినిమా గురించైనా ఇప్పటికీ మాట్లాడతారు. దర్శకుడు రాసుకునే పాత్ర బట్టి ఆయన చేస్తారంతే. ఇది పూర్తిగా ఆయన శైలి చిత్రం అని చెప్పొచ్చు. నరేశ్ గారి పాత్ర, కామెడీ టైమింగ్ అందరికీ నచ్చుతుంది.

ఫస్ట్ కాపీ చూశాక ఏమినిపించింది?

చాలా హ్యాపీ. విరామ సన్నివేశాలు ఇంకా బాగా నచ్చాయి. దానితో పాటు సినిమాకి సోల్ అయినటువంటి క్లుమైక్స్ అద్భుతంగా వచ్చింది. మాకు సినిమా మీద మంచి నమ్మకం ఉంది.

కొత్త దర్శకులు మీతో చేయాలనుకున్నపుడు ఎలా వ్యవహరిస్తారు?

హీరో, నిర్మాతలకి కథ చెప్పి ఒప్పించాడంటే దర్శకుడు తనను తాను నిరూపించుకున్నట్టే. ఎవరొచ్చినా నేను చెప్పేది ఒకటే. మన దగ్గర ఉన్న కథకు ఏ రకంగా న్యాయం చేయగలం అని మాత్రమే. ఆ దర్శకుడు తీసుకొచ్చిన కథను ఎంత బాగా చెప్పవచ్చు అనేదే నా ప్రయత్నం కూడా.

వట్టి పెళ్లేనా..  ప్రేమ సన్నివేశాలేమైనా ఉన్నాయా?

లవ్ ట్రాక్ ఉంది. అయితే  కాస్త భిన్నంగా, ఆసక్తికరంగా చూపించాం. వెన్నెల కిశోర్, వైవా హర్ష పాత్రలు ఫన్ లవర్స్‌ని బాగా నవ్విస్తాయి.

దర్శకుడిగా మారనున్న మీ ప్రయత్నాలు ఏ దశలో ఉన్నాయి?

నా ప్రయత్నాల్లో నేనున్నాను. తప్పకుండా దర్శకత్వం చేస్తాను. నిర్మాత రాజీవ్ గారి గురించి?

ఆయనకి ఒక పెద్ద యానిమేషన్ కంపెనీ ఉంది. ఆరొందలకు పైగా ఉద్యోగులు పనిచేసే సంస్థ అది. అయినా చాలా సింపుల్‌గా ఉంటారు. బ్యానర్‌కి మంచి జరగాలని కోరుకుంటాను. మనుషులతో ఆయన మెలిగే విధానం నాకు బాగా ఇష్టం. అలాంటి వ్యక్తులు రాణించాలి.

ఇరవై ఏళ్ళ ప్రయాణం మీది.. ఎలా అనిపిస్తోంది?

రాసిన సినిమాల లెక్క సరిగ్గా గుర్తులేదు (నవ్వుతూ..). కానీ చాలా బావుంది. 

స్వరకర్త గురించి చెబుతూ “కథకు అవసరమైన పాటలను అందిస్తారు గోపీసుందర్. ఒక్క పాట మినహా అన్ని పాటల చర్చల్లోనూ పాల్గొన్నాను. నేప థ్య సంగీతం కూడా బాగా చేశారని చెప్పిన ఆయన, నటుడిగా కొనసాగే ఆలోచనలు లేవని ప్రస్తుతం తాను రాసిన ‘డెకాయిట్’, ‘గూఢచారి 2’ పనులు జరుగుతున్నా”యంటూ ముగించారు.