14 May, 2026 | 8:59 AM

65 శాతం కోటా రద్దు

21-06-2024 12:39 AM
  • పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య

పాట్నా (బీహార్), జూన్ 20: పాట్నా హైకోర్టులో నితీశ్‌కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ స్థాయిలో రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం ప్రకటించింది. తాజాగా పెంచిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో కులగణన చేపట్టి ఆ నివేదికను నితీశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దాంతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకురాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

అనంతరం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దాంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి. కాగా, ఈడబ్ల్యూఎస్‌కు ఉద్దేశించిన 10 శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం 75 శాతానికి రిజర్వేషన్లు చేరాయి. తాజా పెంపుతో ఎస్సీలకు 16 నుంచి 20 శాతానికి, ఎస్టీలకు ఒక శాతం నుంచి రెండు శాతానికి, ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. ఈ పెంపుపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. వారంతా పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా హైకోర్టు ధర్మాసనం విచారించింది. ప్రభుత్వంతో పాటు పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు.. ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వు చేసింది. గురువారం ప్రభుత్వం పెంచిన 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది.