14 May, 2026 | 10:01 AM

ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి

21-06-2024 12:36 AM

సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి 

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాంతం తెలంగాణ సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.  సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయడంలో కీలకపాత్ర పోషించారని, తుది శ్వాసవరకు తెలంగాణ కోసమే పరితపించారని, అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. తన అనుభావాన్ని మొత్తం తెలంగాణకు ధారపోసి, రాష్ట్ర ఏర్పాటుకు ముందు అన్ని రంగాల్లో మన రాష్ట్రానికి ఉన్న ఉజ్వల భవిష్యత్‌ను వీక్షించిన స్వాప్నికుడని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ విలేజ్‌గా ప్రకటించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.    

ఉద్యమానికి సార్ ప్రోత్సాహం మరువలేనిది: కేసీఆర్ 

తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన చివరి దశ  పోరాటంలో ఉద్యమ రథసారథిగా తనను ముందు నడుపుతూ ప్రొఫెసర్ జయశంకర్ అందించిన ప్రోత్సాహం జీవితంలో మరువలేనిదని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి చేసి తన జీవితం అర్పించిన మహానీయుడని పేర్కొంటూ ఆయన త్యాగాలను, కృషిని స్మరించుకున్నారు. తెలంగాణ సాధన కోసం అనుసరించాల్సిన పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యూహాలను  తన ఉద్యమ కార్యాచరణకు ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన సైద్ధాంతిక నైతిక మద్దతు మహోన్నతమైనదని పేర్కొన్నారు. పదేండ్ల పాటు కొనసాగిన బీఆర్‌ఎస్ ప్రగతి పాలనలో ఆయన స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు. నేటి రాష్ట్ర ప్రభుత్వం అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసే దిశగా పాలన అందించిన నాడే మనం వారికి  ఘన నివాళి అర్పించినవారమవుతామని స్పష్టం చేశారు.