05-12-2024 01:34:48 AM
గద్వాల(వనపర్తి), డిసెంబర్ 4 (విజయక్రాంతి): జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలో ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రవాణాశాఖపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దాడులు నిర్వహించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు దాడులను నిర్వహించారు. అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన ఏసీబీ అధికారులు అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద దాడులను నిర్వహించారు. ఏఎంఐ అధికారులు రమేశ్, అమృతవర్షిణి, కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, హోంగార్డు గోవిందు నుంచి రూ.29,200 నగదును స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టినట్లు తెలిసింది.
ఆదిలాబాద్ జిల్లాలో...
ఆదిలాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలతో హడలెత్తించారు. తెలంగాణ సరిహద్దులోని అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బోరజ్ చెక్ పోస్టు కార్యాలయంలో దాడులు నిరహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు కరీంనగర్ డివిజన్ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి రశీదులు లేని రూ.62,500 నగదును సాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విధుల్లో ఉన్న ఏఎంవీఐలను, ఇతర సిబ్బందిని విచారించినట్లు పేర్కొన్నారు.