05-12-2024 01:33:25 AM
కరీంనగర్, డిసెంబరు 4 (విజయక్రాంతి): తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ బస్సు డిపోలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ వ్యవస్థలో 10 సంవత్సరాల తర్వా త రెండు నూతన ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లిలో ఒకటి , ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మరో డిపోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ రెండు డిపోలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని, ములుగు ఆర్టీసీ డిపోకు సంబంధించి మంత్రి సీతక్కకు, పెద్దపల్లి ఆర్టీసీ డిపోకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే విజయరమణరావులకు ఆర్డర్లు అందిస్తామన్నారు. రెండు నూతన డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు, మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందస్తూ త్వరలోనే బస్సు డిపో నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు.
పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం జిల్లా కేంద్రం చేసిన అక్కడ బస్సు డిపో లేకపోవడంతో రవాణాశాఖ మంత్రిగా జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు విజ్ఞప్తి మేరకు అక్కడ బస్సు డిపో మంజూరు చేశానన్నారు. ఇదిలా ఉండగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.