calender_icon.png 30 June, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ నజర్

30-06-2025 02:00:42 AM

  1. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడుల నేపథ్యంలో హడల్
  2. భయం భయంగా అధికారుల విధులు
  3. ఏజెంట్లను ఆఫీసులోకి రానీయకుండా చర్యలు
  4. అధికారులతో దళారుల మిలాఖత్
  5. ఏ పని కావాలన్నా అమ్యామ్యాలు అందాల్సిందే
  6. దరఖాస్తుపై కోడ్ భాషతో లావాదేవీలు
  7. రూ.లక్షల్లో పై అధికారుల రోజువారీ ఆదాయం? 

తుర్కయంజాల్, జూన్ 29: ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా కార్యాలయంపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఏ కార్యాల యాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు చేస్తుంది. దీంతో ఆర్టిఏ కార్యాలయాల్లో అలజడి రేగుతోంది. రాజధాని నగరానికి ఆనుకొని ఈ ఆర్టీఏ ఆఫీసు ఉండటంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, పాత వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ల జారీ, తదితర కార్యకలాపాలతో నిత్యం మన్నెగూడ కార్యాలయం రద్దీగా ఉంటుంది.

వినియోగదారుల అవసరాలకు మించి ఇక్కడ దళారుల దందా మూడు పువ్వులు, ఆరుకాయలుగా నిత్యం సాగుతుంది. ఆర్టీఏ కార్యాలయంలో ఏ ఫైల్ ముందుకు జరగాలన్నా దళారులే మధ్యవర్తులుగా వ్యవహారం సాగిస్తారని ఆరోపణలు న్నాయి. దీంతో ఏసీబీ అధికారులు మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాల యంపై ఫోకస్ పెట్టినట్లు వినికిడి. ఈ క్రమం లో అధికారులు భయం గుప్పిట్లో, ఎంతో జాగూరుకతతో పనుల్లో నిమగ్నమవుతున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆఫీసులోకి ఏజెంట్లను రానీయకుండా జాగ్ర త్తలు తీసుకుంటున్నారు. కాగా, కొందరు ఏజెంట్లు తమను ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా ఆర్టీఏ ఆఫీసు ప్రాంగణంలోనే వినియోగదారులతో బేరసారాలకు దిగిన వ్యవహారం బయటపడింది. ఇదేంటని ప్రశ్నించేలోపే గోడదూకి పారిపోయిన ఘట న మూడు రోజుల క్రితం వెలుగుచూసింది. మరోవైపు ఇబ్రహీంపట్నం నలువైపులా రోడ్లపై ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తన్నారు. ఓవర్ లోడ్, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకున్నారు.

’ప్రతి పనికి చేతులు తడపాల్సిందే’

మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంలో ఏ పని కావాలన్నా డబ్బు లు చెల్లించాల్సిందేనన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వెళ్తే పనులు అయ్యే పరిస్థితి ఉండ దు. రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే. దీంతో ఏజెంట్లు డిమాండ్ చేసినట్లుగా వాహనదారులు తప్పక ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చేవారు.

ఆర్టీఏ ఆఫీసులో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులంతా ఆమ్యామ్యాలకు అలవాటు పడిపడి, ఏజెంట్ల సాయంతో ఫైలుకు ఇంత అంటూ జేబులో వేసుకునేవారన్న ఆరోపణలున్నాయి. వినియోగ దారుల జేబుకు చిల్లుపెట్టడమే ధ్యేయమంటూ ఆఫీసర్లు వ్యవహరించడం, వాహ నదారుల వద్ద ఏజెంట్లు ఇష్టానుసారంగా వసూలు చేయడం పరిపాటిగా మారిపోయింది. 

’వసూళ్లకు కోడ్ భాష’

ఆర్టీఏ ఆఫీసులో తమ ముందుకు వచ్చిన ఫైల్ ఏదనేది అధికారులకు అక్కర్లేదు. ఆ దరఖాస్తు పేపర్ వెనుకాల ఉన్న కోడ్ (సంఖ్య) వారికి ముఖ్యం. దరఖాస్తుపై కోడ్ ఉంటే ఏజెంట్ ద్వారా వచ్చిందనేది స్పష్టం. ఒకవేళ ఆ ఫైల్ పై కోడ్ లేదంటే అది పక్కకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ ఫైల్ కి పైకం రాదు కాబట్టి. ఇక అధికారులంతా కోడ్ భాషలోనే మాట్లాడుకుంటారు. కోడ్ సంఖ్యను బట్టి సదరు ఫైల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుం ది.

వాళ్ల భాషలో సరైన కోడ్ అయితే పని చకచకా జరిగిపోతుంది. లేదంటే ఎన్ని రోజు లు తిరిగినా ఫైలు జరగదు, ఫలితం ఉండదు. ఎవ్వరు చెప్పినా పని పూర్తి కాదు. అక్కడ ఆగిపోతుంది. దీంతో అధికారుల ఆదాయం మూడు పువ్వులు, ఆరుకాయలుగా విలసిల్లుతోందని చెబుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించారు. అన్ని పత్రాలతో నేరుగా కార్యాలయానికి వెళ్లి పనిచేసు కుందామనుకున్న వ్యక్తులకు ఇక్కడ చుక్కలు కన్పించడం ఖాయం.

మీ ఏజెంట్ ఎవరంటూ అధికారులే నేరుగా అడిగే దుస్థితి ఇక్కడి సొంతం. అలాగే లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, పాత వాహనాలకు ఫిట్ నెస్ వంటి ఏ పని చేయించుకోవాలన్నా ఏజెంట్ ఉండాల్సిందే. డ్రైవింగ్ సరిగ్గా రాకపోయినా, వాహనాలు ఉండి లైసెన్సులు లేకపోయినా దళారుల వద్దకు పోయి వారు చెప్పిన ఫీజులు చెల్లిస్తే పనులు చకచకా అయిపోతాయి. 

లక్షల్లో రోజువారీ ఆదాయం?’

రవాణాశాఖ కార్యాలయంలో పైస్థాయి అధికారుల ఆదాయం రోజుకు లక్షల రూపాయల్లో ఉంటుందనేది బహిరంగ రహస్యం. ఆఫీసులో ఆయా అధికారి స్థాయిని బట్టి వాటాల పంపకం ఉంటుందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి అధికారులు భరతంపట్టేలా ఏసీబీ నిరాటంకంగా దాడులు కొనసాగిస్తోందన్న చర్చ నడుస్తోంది.ఏజెంట్లను అధికారులు ఏమీ అనకపోవడానికి వారిచ్చే ఆమ్యామ్యాలే కారణమంటున్నారు స్థానికులు.

వాహనదారు లకు లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, ఫిట్ నెస్ సర్టిఫికెట్ల జారీ, తదితర కార్యకలాపాల కోసం ఆర్టీఏలో ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే పని జరుగుతుంది. ఇందుకోసం వాహనదారులు ఆ ఏజెంట్ అడిగినంత ముట్టజెప్పా ల్సిందే. వాహనాల ఫిట్నెస్, పేర్ల మార్పిడి, ఓవర్‌లోడ్ వెహికిల్స్ పేరిట అదనంగా గుంజడం సాధారణమే.