calender_icon.png 18 July, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వసతులు కల్పించాలి

17-07-2025 11:42:39 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కాగజ్ నగర్,(విజయక్రాంతి): నిరుపేదల కొరకు ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇండ్లలో పూర్తి స్థాయి వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి విద్యుత్, రోడ్లు భవనాలు, హౌసింగ్, మిషన్ భగీరథ శాఖల అధికారులు, తహసిల్దార్ లతో కలిసి బోరిగం గ్రామ శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించి మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేసే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... రెండు పడక గదల ఇండ్లలో లబ్ధిదారులకు అవసరమైన వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని తెలిపారు. మొత్తం 12 బ్లాక్ లలో 228 రెండు పడక గదుల ఇండ్లను నిర్మించడం జరిగిందని, ఇంకా మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం, మిషన్ భగీరథ త్రాగునీరు, పెయింటింగ్, కిటికీలు, తలుపులు, అంతర్గత రహదారుల నిర్మాణాలు ఇతర అన్ని పనుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. త్వరలో మంత్రుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించేందుకు ఇండ్లను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్. ఈ. శేషరావు, హౌసింగ్ పి. డి. వేణుగోపాల్, మండల తహసిల్దార్ మధుకర్, రోడ్లు భవనాల శాఖ అధికారులు, గుత్తేదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.