18-07-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా 17, (విజయ క్రాంతి)జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పసుపులేటి వీరబాబు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు.యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా, పలు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యకలాపాల ఇన్చార్జిగా, కొత్తగూడెం, ములుగు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బాధ్యునిగా, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీ విధేయుడిని పేరున్న ఆయనను గ్రంథాలయ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కరుణ కుమారి ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలకడం తో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె వీరబాబుకు జిల్లా గ్రంథాలయ ఉద్యోగులను పరిచయం చేశారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను త్వరలో పరిశీలిస్తానని, ఆయా గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించే దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలతో సమానమని, అలాంటి దేవాలయాలను సంపూర్ణంగా తీర్చిదిద్ది ఉద్యోగులు సిబ్బంది సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానని తెలిపారు.
అంతా కలిసిమెలిసి పని చేద్దామని, పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి పాఠకులకు అనుకూలమైన వాతావరణాన్ని గ్రంథాలయాల్లో మరింతగా ఏర్పాటు చేద్దామని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రంథాలయాల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్ కుమార్, గ్రంథ పాలకులు జి. మణి మృదుల, నాగన్న, మధుబాబు అశ్వరావుపేట నియోజకవర్గ బీసీ సంఘం యువజన అధ్యక్షులు పల్లె వరప్రసాద్, లక్ష్మీదేవి పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జల్లారపు ఈశ్వర్, భద్రాద్రి బీసీ సంఘం ఉపాధ్యక్షులు బండి శ్రీకాంత్ గౌడ్, లక్ష్మీదేవిపల్లి మండలం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లావుడియా నరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.