వీబీజీ రాంజీతో జవాబుదారీతనం
పగడాల శివప్రసాద్ :
గ్రామీణ భారతదేశంలో నిరుద్యో గం, ఆకలి, వలసలు తీవ్ర సమస్యలుగా మారాయి. ఈ పరిస్థితిలో ‘ఉపాధి హామీ చట్టం’ సాధారణ సంక్షేమ పథకం మాత్రమే కాకుండా, ఇది పేదల జీవన హక్కును రక్షించే చట్టంగా రూపాంతరం చెందవలసిన అవసరం ఉన్నది. 2005 సంవత్సరంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సంయుక్త క్రియాశీలక కూటమి (యూపీఏ) ప్రభుత్వం ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ చట్టం’ ‘ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ’ అమలుకు నిర్ణయం తీసుకున్నది.
దేశ వ్యాప్తంగా అమలు చేయాలనే గొప్ప దూర దృష్టితో ఈ పథకం అమలుకు కేంద్రం సిద్ధపడ్డది. కానీ ఉపాధిని హక్కుగా గుర్తించడం లో, 100 రోజుల కనీస హామీ ఇవ్వడంలో, నిరుద్యోగ భృతి చెల్లింపులో, మహిళలకు మరింత ప్రాధాన్యతలో, సోషల్ ఆడిట్, దేశవ్యాప్తంగా పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడంలో అనేక లోటుపాట్లు, అవకతవక లు పథకం యొక్క లక్ష్యాలను అపహాస్యం చేశాయి. నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో అప్పటి ప్రభుత్వం తత్సారం చేసిన కారణంగా ఆశించిన ఫలితాలు రాలేదు.
లక్ష్యం నెరవేరని పథకం
ప్రధానంగా గ్రామీణ పేదలు తమ భాష లో స్వయంగా పిలుచుకునే ‘కరువు పని’ లక్ష్యం నెరవేరి, ఫలప్రదం కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అసలు గ్రామం లో ఉనికిలో లేని కూలీలను సాంకేతికంగా చూపించడం, స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారిని ఉపాధి హామీ లబ్ధిదారులుగా చూపి పెద్ద మొత్తంలో నిధులను దారి మళ్లించారు. కూలీల సంఖ్య కన్నా గ్రామీణ ప్రాంత కూలీల పొట్ట గొట్టిన ఈ అవకతవకలలో అనేకమంది ప్రజాప్రతినిధులు, అధికారులు,సిబ్బంది పాత్ర కూడా వెలుగు చూడడం విస్మయం కలిగిస్తుంది.
ముఖ్యంగా కూలీలకు చెల్లించిన వేతనాల కన్నా అధికంగా చూపించడం, ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అవసరమైన పనిముట్ల సామాగ్రి కొనుగోలులో కూడా మార్కెట్ ధరల కన్నా ఎక్కువ పెట్టి కొనడం, అసలు సరఫరా చేయని కంపెనీలకు బోగస్ చెల్లింపులు చేయడం, ఉపాధి హామీ పనులకు హాజరుకాకున్నా బోగస్ లబ్ధిదారుల పేర్లు నమోదు చేయడం, క్లస్టర్ ఇన్‌చార్జి, ఫీల్డ్ అసిస్టెంట్‌ల అవినీతి పరాకాష్టకు చేర డం ఈ పథకం నీరుగారడానికి ప్రధాన కారణంగా మారాయి.
కొత్త పథకంతో పాత కష్టాలు తీరాలి
ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తం గా 741 జిల్లాలలోని దాదాపు రెండు లక్షల 69 వేల గ్రామపంచాయతీలలో 12 కోట్ల 15 లక్షల మంది లబ్ధిదారులుగా చేరినట్లు పార్లమెంటు లెక్కలు చెబుతున్నాయి. ఈ లబ్ధిదా రుల్లో సగం మంది మహిళలు కాగా దాదా పు 36 శాతం ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన ‘వీబీజీ రాంజీ పథకం’ ‘ఎంజి నరేగా’ పథకానికి భిన్నంగా ఆచరణలు, అమలు పద్ధతులు రూపకల్పన చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
గతంలో 100 రోజులు ఉన్న పని దినాలను 125 రోజులకు పెంచడం నిజంగా గ్రామీణ కూలీలకు ఎంతో ప్రయోజనకరం. ‘ఎంజీ నరేగా’ పద్ధతిలో కాకుండా పనిచేసిన కూలీలకు వెం టనే జీతాలు చెల్లించడం. ఉత్పన్నమైన ప్రతి లోపాన్ని వెంటనే పరిష్కరించడం, బోగస్ లబ్ధిదారులు లేకుండా పనిముట్ల చెల్లింపులలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకో వాలి. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వం చేరుకోవాలనుకున్న లక్ష్యాల పరిపూర్ణతకు గండి కొట్టకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలి.
ఈ పథకం అమలు విధివిధానాల పట్ల ప్రజలను పథకంలో లబ్ధిదారులైన కూలీలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. వీబీజీ రాంజీ 2025 చట్టం గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్వావలంబనకు నాణ్యమైన జీవన ప్రమాణాలు పెంపొందించడానికి పకడ్బందీగా అమలు చేయాలి. పథకం అమలుకు గతం లో ఉన్నటువంటి లోపాలను, జరిగిన అక్రమాలను పసిగట్టి వ్యవస్థాపరమైన లోపా లను కట్టుదిట్టం చేయాలి.
గతంలో మాదిరిగా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అవసర మైన అన్ని పనులను ఉదాహరణకు.. చెరువులు తవ్వడం, కాలువలు, చెక్ డ్యాములు నిర్మించడం, గ్రామీణ రహదారులు మొదలైన పనులే కాకుండా శాశ్వత నిర్మాణాలలో కూడా వీబీజీ రాంజీ కూలీలను భాగస్వాములను చేస్తే గ్రామీణ ఆర్థిక పరిపుష్టి పెరుగు తుంది. ఈ 125 రోజుల పని దినాలే కాకుం డా అవసరమైతే మరొక 25 రోజులు అదనంగా తీసుకొని ఏడాదికి 150 రోజుల పని దినాలను కల్పిస్తే.. గ్రామీణ కూలీలకు ఈ పథకం ద్వారా సాకారం అవుతుంది.
పేదల విశ్వాసాన్ని పొందాలి..
‘వీబీజీ రాంజీ‘ పథకం ద్వారా గ్రామస్థాయిలో ఉన్న నిధులను వినియోగించడమే కాకుండా, దరఖాస్తుకు సంబంధం లేకుండా అవసరమైన ప్రతి పనిని చేపట్టడంలో ఈ పథకం ద్వారా అతి స్వల్ప కాలంలోనే ఉజ్వ ల గ్రామీణ భారతం సాక్షాత్కరిస్తుంది. గతం లో కేంద్రమే పూర్తిగా నిధులు కేటాయించడంతో పనులు జరిగేవి, కానీ రాష్ట్రాలు ఈ పథకం అమలుపట్ల ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇప్పుడు -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్రాల జవాబుదారీతనానికి, పనుల నాణ్యతపై సమగ్ర పరిశీలన జరపడానికి, అధికార యంత్రాంగం మరింత క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుంది.
కేంద్రం ఇచ్చే గ్రాంట్‌కు రాష్ట్రాల గ్రాంట్‌తోడైతే అభివృద్ధి కూడా రెండంతలు పెరుగు తుంది. 2025-26 సంవత్సరంలో 9 నెల ల్లో కేవలం 27 రోజులు మాత్రమే పనులు చేపట్టి ఉత్తరాఖండ్ ఒకటవ స్థానంలో నిలవగా, కేవలం 28 రోజులతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2025లో ఏప్రి ల్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి కుటుంబం సగటు 28 రోజులు పను లు నమోదు చేసుకోగా, 100 రోజుల పని పూర్తిచేసిన కుటుంబాలు కేవలం 6000 మాత్రమే 100 రోజుల పనిని సాధించాయి.
ఏప్రిల్ 1వ తేదీ 2026 నుంచి ‘వికసిత్ భార త్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవి కమిషన్ (గ్రామీణ్)’ చట్టంగా అమలుకు రానున్న విషయం అందరికీ తెలిసిందే. 2025 సంవత్సరంలో ఉపాధి పొందిన కుటుంబాల సం ఖ్య 25.33 లక్షల నుంచి 19.94 లక్షలకు తగ్గిపోయింది. దాదాపు 21.3% తగ్గి ప్రతి కుటుంబానికి సగటున లభించిన 41 రోజు ల పని దినాలు 27 రోజులకు పడిపోయా యి. దీంతో ఒక్కో కుటుంబానికి 19.4% (రూ.1686/-)తక్కువ ఆదాయం లభించింది.
మన రాష్ట్రంలో అత్యధికంగా పనులు తగ్గిన జిల్లాల జాబితాలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా -92.8% కాగా, నిజామాబాద్ -67.1% గా నమోదయ్యాయి.ఇదే కాకుండా ముఖ్యం గా జాబు కార్డులు తొలగించడం, తొలగించిన జాబ్ కార్డులు పునరుద్ధరణ జరగకపో వడం, ఈ కేవైసీ నమోదు మరో కారణం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం కొనసాగడంతో దాదాపు 5.1 లక్షల జాబు కార్డులు తొలగించబడ్డాయి.
ముఖ్యంగా ప్రభుత్వ బిల్లు నెంబ ర్ 197/2025లోని సెక్షన్ 8 (1) ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుం బానికి 125 రోజులపాటు వేతన ఆధార ఉపాధి హామీ ఇచ్చే ఒక పథకాన్ని రూపొందించుకోవాలి. తద్వారా దేశంలో 12 కోట్ల కుటుంబాల మనుగడకు వీబీజీ రాంజీ పథకం జీవనాడిగా వర్ధిల్లాలి. భారతీయ పౌరుడైన ప్రతి వ్యక్తికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశమే కాకుండా, గౌరవమైన జీవన ప్రమాణాలు పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం. కేంద్రం విడుదల చేస్తున్న 60% నిధులు రాష్ట్రాల 40% నిధులతో ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి.
ముఖ్యంగా 125 రోజుల చొప్పున గ్రామీ ణ పేదల కుటుంబాలకు ఉపాధి కల్పన చేయడం ఊహకందని నిర్ణయం. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలో జాబ్ కార్డులు ఉన్న 8.6కోట్ల మందిలో 40.75% కుటుంబాల వారే పూర్తిగా 100 రోజులు ఉపాధి పొందగలిగారు. 2025--26 సంవత్సరానికి ఈ లబ్ధిదారుల సంఖ్య 6.7 లక్షల కుటుంబాలకు తగ్గిపోయింది.
ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించలేని కారణంగానే నిరుపేదలు కరువు పనులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తక్షణం అధిగమించాలి. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసి గ్రామీణ పేద ప్రజల విశ్వాసాన్ని పొందాలి. అవినీతికి ఆస్కారం లేని నిరుపేద గ్రామీణ కూలీని నాణ్యమైన జీవన ప్రమాణాలతో సగటు భారతీయ పౌరునిగా తలెత్తుకునేలా చేసే క్రమంలో ఈ వీబీజీ రాంజీ పథకం ‘మైలురాయి’లా నిలుస్తుందని ఆశిద్దాం.




