3 April, 2026 | 3:25 AM

ఐప్యాక్‌పై ఈడీ సోదాలు

03-04-2026 01:39 AM

బొగ్గు స్మగ్లింగ్ కేసు

ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో.. రూ. 10 కోట్ల వరకు అక్రమ నిధులు ఐప్యాక్‌కు చేరినట్టు అనుమానం

ఎన్నికలు సమీపిస్తుండటంతో పెరుగుతున్న ఉత్కంఠ

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్‌లో సంచలనం రేపిన బొగ్గు స్మగ్లింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతున్నది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్)కు సంబంధించిన కార్యాలయాలు, అనుబంధ వ్యక్తుల నివాసాలపై ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఈ దాడులు సాధారణ దర్యా ప్తు చర్యలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసే పరిణా మంగా మారాయి.

ఈ సోదాల్లో భాగంగా ఐప్యాక్ డైరెక్టర్లలో ఒకరైన రిషిరాజ్ సింగ్ నివాసాన్ని బెంగళూరులో అధికారులు తనిఖీ చేశారు. అలాగే సంస్థకు చెందిన మరికొన్ని కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ కేసు కేవలం ఆర్థిక అక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా, రాజకీయ సంబంధాలు, ఎన్నికల వ్యూహాలతో ముడిపడి ఉండటం వల్ల దాని ప్రాధాన్యం మరింత పెరిగింది. పశ్చి మ బెంగాల్‌లో బొగ్గు అక్రమ రవాణా కేసు గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

ఈ కేసులో పెద్దఎత్తున బొగ్గు స్మగ్లింగ్, అక్రమంగా సంపాదించిన డబ్బు (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్), హవాలా లావాదేవీల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిపై ఈడీ కేసులు నమోదుచేసి, అరెస్టులు కూడా చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా ఐప్యాక్ పేరు వెలుగులోకి రావడం కీలక పరిణామంగా మారింది.

ఈడీ ఆరోపణల ప్రకారం, సుమారు రూ.10 కోట్ల వరకు అక్రమ నిధులు హవాలా మార్గాల్లో ఐప్యాక్‌కు చేరినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఈ చెల్లింపులు జరిగాయని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

గతంలోనూ సోదాలు..

ఇదే కేసులో ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయం, అలాగే డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి వెళ్లి నిరసన తెలపడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ సమయంలో సోదాల ప్రక్రియకు అంతరాయం కలిగిందని, కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లో నుంచి తొలగించారని ఈడీ ఆరోపించింది.

అయితే మమతా బెనర్జీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, కేంద్ర సంస్థలు రాజకీయ ప్రేరణతో వ్యవహరిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. ఈ వివాదం తర్వాత ఈడీ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొంటూ సీబీఐ ద్వారా విచారణ జరపాలని కోరింది.

ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయపరంగా కూడా కీలకదశలో ఉంది. ఇక ఐప్యాక్ ప్రమోటర్లు రిషిరాజ్ సింగ్, ప్రతీక్ జైన్లకు జారీ చేసిన సమన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు సమన్ల అమలును వాయిదా వేయవచ్చని ఈడీ కోర్టుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. 

పెరుగుతున్న ఉద్రిక్తత..

ఐప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహాత్మక సలహాలు, డిజిటల్ క్యాంపెయిన్, మీడియా నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి ఈ సంస్థ టీఎంసీతో సన్నిహితంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఈడీ సోదాలు జరగడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రతిపక్షాలు ఈ కేసును అవినీతి నిరూపణగా చూపించే ప్రయత్నం చేస్తుండగా, టీఎంసీ మాత్రం ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపిస్తోంది.

కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా కోల్ స్మగ్లింగ్ కేసు కేవలం ఆర్థిక నేరాల దర్యాప్తు పరిమితిలోనే కాకుండా, దేశ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఐప్యాక్‌పై తాజా సోదాలు ఈ కేసుకు మరింత ఉత్కంఠను పెంచాయి. రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో, న్యాయస్థానాల తీర్పులు ఎలా ఉంటాయో అనేది రాజకీయంగా, న్యాయపరంగా కూడా అత్యంత కీలకంగా మారింది.