3 April, 2026 | 2:47 AM

బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్‌పై వేటు

03-04-2026 01:04 AM
  1. డీసీ సరస్వతి సహా పది మంది అధికారుల సస్పెన్షన్ 
  2. రూ. 150 కోట్లు దారి మళ్లించారన్న ఏసీబీ
  3. డీసీగా సమ్మయ్య బాధ్యతల స్వీకరణ

బడంగ్‌పేట్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రూ.150 కోట్లు దారిమళ్లించా రన్న ఆరోపణలతో బడంగ్‌పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి సహా పది మంది వివిధ శాఖల అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. జీహెచ్‌ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ (సర్కిల్ 16) డిప్యూటీ కమిషనర్‌గా సరస్వతి పనిచేసిన సమయంలో సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా నిధులను అక్రమంగా దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో నిధుల దుర్వినియోగంపై పెద్దఎత్తున ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ముఖ్యంగా సివిల్ పనులు, పారిశుద్ధ్యం, ఇతర విభాగాలకు కేటాయించిన నిధుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఏసీబీ, విజిలెన్స్ అధికారులు ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సిద్ధం చేసిన నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా డీసీ సరస్వతితో పాటు మరో పది మంది వివిధ శాఖల అధికారులను సస్పెండ్ చేశారు. గురువారం బడంగ్‌పేట్ డీసీగా సమ్మయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అత్తాపూర్ (సర్కిల్ 20) డీసీగా పనిచేశారు. ప్రభుత్వం బదిలీ చేయడంతో ఇక్కడకు వచ్చారు.