డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట,(విజయక్రాంతి): డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల దాకా అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 100 శాతం బయోమెట్రిక్ హాజరు ఉండాలని స్పష్టం చేశారు. ఉదయం ఇన్ టైంలో పంచ్ చేయకపోయినా, సాయంత్రం ముందే వెళ్లిపోయినా అడ్మినిస్ట్రేటివ్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని, ఐడీ కార్డులు ధరించాలన్నారు. ఓపీ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్లినికల్ అవర్స్ లో విధిగా ఉండాలన్నారు. జూనియర్ డాక్టర్లపైనే భారం వేయకుండా సీనియర్లు నేరుగా రోగులను పరీక్షించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మెడికల్ వార్డులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఫీవర్ కేసులు, అడ్మిషన్లు, డిశ్చార్జ్ వివరాలను అప్‌డేట్ చేయాలన్నారు.
మందుల కొరత లేకుండా బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, అత్యాధునిక శస్త్రచికిత్సల కోసం లాపరోస్కోపిక్ సెట్స్, అడ్వాన్స్డ్ లాపరోస్కోపీ టవర్స్ కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు లేదా కలెక్టరేట్ గ్రాంట్ల ద్వారా సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఈయన. వెంట డాక్టర్లు జనార్ధన్, అనిత, ఉపేందర్, యశ్వంత్, గీత, సంధ్య, వినయ్ లు ఉన్నారు.






