జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
25-07-2026 09:51 PM
వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్లు, ఊటకుంటలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. జలసిరి, ఉపాధి హామీ పథకం పనులను వేగవంతంగా పూర్తి చేసి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.






