ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
పీఎస్‌లో బీజేపీ నాయకుల ఫిర్యాదు
ఖానాపూర్, జూలై 25 (విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం నర్సాపూర్ (జి), మామడ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌పై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానమంత్రి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నరేందర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.






