మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై నుంచి అక్రమంగా కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి ముల్లంగిరి శ్రీహరి చారి, బిజెపి సీనియర్ నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా తదితరులు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశుకు వినతిపత్రం సమర్పించారు. చెరువు కట్టను తవ్వి ఈత చెట్లను నరికి వేసి రోడ్డు వేశారని తెలిపారు.
అంతేగాక చెరువు కట్ట బఫర్ జోన్ లో నిర్మాణం చేస్తున్నారని, జాతీయ రహదారిని ఆనుకొని అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అక్రమంగా రోడ్డు వేసి అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పెద్ద మొత్తంలో మామూళ్ళు తీసుకొని పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. రోడ్డుకు, అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారని తెలిపారు. ఇరిగేషన్ ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ చెరువు కట్ట తవ్విన విషయం తెలిసినప్పటికీ ఇటువైపు రావడంలేదని తెలిపారు. ఈ విషయమై కలెక్టర్, హైడ్రా, సిడిఎంఏ అధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు స్పష్టం చేశారు.




