కార్యకర్తలే కాంగ్రెస్‌కు బలం

01-05-2024 12:57:57 AM

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం

ఖమ్మం , ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ అని,  కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలాంటిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో భట్టి  మాట్లాడారు. రాష్ట్రంలో అమోఘమైన ఫలితాలిచ్చి రికార్డు సృష్టించిన చరిత్ర  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సొంతం అని పునరుద్ఘాటించారు. పదేండ్లు అధికారంలో లేకపోయినా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పట్టు తగ్గకుండా కార్యకర్తలు కృషిచేశారని కొనియాడారు. కేడర్‌కు అండగా ఎవరు ఉన్నా లేకపోయినా జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి అండగా ఉండి  అసెంబ్లీ ఎన్నికల్లో  గెలిపించారని కితాబిచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులు జిల్లాల్లో తిరుగుతూ అవాకులు చవాకులు పేలున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అన్నీ  సార్వత్రిక ఎన్నికల్లో  ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్ పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటే గెలవడం ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

కార్యకర్తల శ్రమ వృథా కానివ్వబోమని చెప్పారు. ఖమ్మం తో పాటు మహబూబాబాద్ కూడా బంపర్ మెజార్టీతో గెలబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ పాలనతో ప్రజాస్వామ్యం నీరుగారుతోందని విమర్శించారు. దేశంలోని ప్రజలను మతం పేరుతో విడగొడుతున్నదని ధ్వజమెత్తారు.  బీజేపీ చేస్తున్న అన్యాయాలను, పెంచుతున్న మత విద్వేషాలను అందరికీ తెలియ జెప్పేందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. ప్రజల సంపద ప్రజలకే చెందాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని స్పష్టంచేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందకు, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను మార్చి విద్యార్థులకు న్యాయం చేస్తున్నామని స్పష్టంచేశారు. ఏ ఒక్క యూనివర్సిటీలో హాస్టల్‌ను మూసివేయకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించారు.