02-02-2026 01:43:11 AM
ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేస్తే విత్‌డ్రా చేసుకోండి
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించొద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): టికెట్లు దక్కని కార్యకర్తలు నిరాశ చెందొద్దని, పార్టీ అభ్యర్థులందరికీ సమగ్ర సంప్రదింపులు జరిపి, సమిష్ఠి నిర్ణయంతో టికెట్లు కేటాయించి, బీఫామ్ ఇచ్చినట్లు బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు తెలిపారు. పార్టీ టికెట్ పొందని కార్యకర్తలు, అసంతృప్తితో లేదా ఇతర కారణాలతో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తే అది పార్టీ నిర్ణ యాన్ని ధిక్కరించడమేనని పేర్కొన్నారు. ఇలా వేసిన నామినేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే పార్టీ నియమా వళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.
పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, పార్టీలో ఉండి ఇతర పార్టీ తరఫున నామినేషన్ వేసినవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిర్ణయం జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు తీసుకున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి చోటా పోటీలో నిలిచిందని, ఈ ఎన్నికల్లో మేయర్, ఛైర్మన్ పీఠాలను సాధించడం, అలాగే మెజారిటీ స్థానాలను గెలవడం భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు.
మెజార్టీ స్థానాలు గెలిచేలా కష్టపడాలి...
ఇదిలా ఉంటే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఆదివారం రాష్ట్ర కార్యాల యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై పార్టీ నాయకులకు రాంచందర్ రావు, ఎన్నికల ఇన్‌చార్జ్ అశీష్ షెలార్, ఎన్నికల కోఇన్‌చార్జ్ అశోక్ పర్ణామి దిశానిర్దేశం చేశారు. మెజార్టీ స్థానాల్లో బీజీపీ అభ్యర్థులు గెలిచేలా నాయకులంతా కష్టపడాలని సూచించారు.