మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) గనులు, భూగర్భ వనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజును(AD Jaya Raju Remanded) జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అతని, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో జరిపిన సోదాల్లో రూ. 3.06 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించిన తర్వాత, తెలంగాణ ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. జయరాజ్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని వరంగల్ జైలుకు తరలించారు. వరంగల్‌లోని గనులు, భూగర్భ వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు (FAC) నిర్వహిస్తున్న జయ రాజుపై అక్రమ ఆస్తుల (DA) కేసు నమోదు చేసిన అనంతరం ఈ దాడులు జరిగాయి.
అతను తన ఉద్యోగ కాలంలో అవినీతి చర్యలు, అనుమానాస్పద మార్గాల ద్వారా ఆస్తులను కూడబెట్టాడని ఆరోపణలున్నాయి. సదరు అధికారి, అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఎనిమిది ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. జయరాజ్ పేరుపై రూ.65 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారం, నగదు, ఫ్లాట్లు, భూములు, కార్లు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు నిర్ధారించారు. సోదాలు, ప్రాథమిక విచారణ సమయంలో నిందిత అధికారి డ్రైవర్ అయిన సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్‌లోని సమాచారం, ఇప్పటివరకు పరిశీలించిన లావాదేవీల వివరాల ఆధారంగా, సదరు డ్రైవర్ బ్యాంక్ ఖాతా నుండి నిందిత అధికారి కుమార్తె బ్యాంక్ ఖాతాకు పలు లావాదేవీల ద్వారా సుమారు రూ. 24.80 లక్షల మొత్తం బదిలీ అయినట్లు ACB అధికారులు గుర్తించారు. ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తుల నుండి సదరు మొత్తాన్ని వసూలు చేసి, నిందితుడైన అధికారి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్ పేర్కొన్నారు.






