05-12-2024 10:19:42 PM
ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ. 10.80 కోట్లు జమ
అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్
మంచిర్యాల,(విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 326 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, వాటిలో ఆరిన నాణ్యమైన ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్ధతు ధర పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నారు. గురు వారం జిల్లాలోని జైపూర్, భీమారం మండలాల్లోని పీఏసీఎస్, డీసీఎంఎస్, డీఆర్‌డీఏ ఏజెన్సీల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి నాణ్యతను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్‌తో కలిపి క్వింటాలుకు రూ. 2820 చెల్లిస్తుందని, దొడ్డు రకం ధాన్యానికి ‘ఏ’ గ్రేడ్‌కు రూ. 2320, కామన్ రకానికి రూ. 2300 చెల్లిస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటి వరకు రైతుల వద్ద 11,635 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 10.80 కోట్ల నగదును 673 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను విక్రయించి ప్రభుత్వ మద్దతు దర పొందాలని సూచించారు.