25 April, 2026 | 6:32 PM

ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి

25-04-2026 05:14 PM

అదనపు కలెక్టర్ (రెవిన్యూ) టి. వినోద్ కుమార్

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటరు మాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) టి. వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి ఓటరు మాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. గ్రామ పాలన అధికారులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి యుద్ధ ప్రాతిపదికన మాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ మరియు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సాధా బైనామా మరియు భూ భారతి దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిశీలించి నివేదికలు సమర్పించాలని సూచించారు.

తహసీల్దార్ కార్యాలయంలో విచారణలో ఉన్న అన్ని రకాల సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ఓటరు మాపింగ్ పనుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ పాలన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఓటరు మాపింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.